నిజాం కళాశాల మైదానంలో జరిగిన సకల జనభేరి టీఆర్‌ఎస్ పార్టీ సభను తలపించిందని తెలంగాణ సెటిలర్‌స ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.శ్రీనివాసరాజు విమర్శించారు.
తెలంగాణ సెటిలర్‌స ఫ్రంట్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: నిజాం కళాశాల మైదానంలో జరిగిన సకల జనభేరి టీఆర్‌ఎస్ పార్టీ సభను తలపించిందని తెలంగాణ సెటిలర్‌స ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.శ్రీనివాసరాజు విమర్శించారు. ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సకల జనుల పేరుతో జరిగిన సభలో తెలంగాణ భావజాలమున్న నేతలకు చోటులేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఉద్యమానికి ఊపుతెచ్చిన ఓయూ విద్యార్థులను ఎందుకు మాట్లాడనివ్వలేదన్నారు.
తెలుగు సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ చేశానంటూ పదేపదే చెప్పుకునే కేసీఆర్ నోటివెంట నోటిదురుసు పదాలు రావడం బాధాకరమన్నారు. ఉద్యమాన్ని తనవైపుకు తిప్పుకోవడానికే సీమాంధ్ర జిల్లాల్లో అలజడి పుట్టించేలా కేసీఆర్ కుట్ర పన్నారని తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు సతీష్ మాదిగ దుయ్యబట్టారు. నిజాం కాలేజీ గ్రౌండ్‌సలో జరిగింది సకల జనభేరి కాదని, సకల జన‘బేర’మని ఎద్దేవా చేశారు.