విద్యార్థుల ఆందోళనకు హాజరై సంఘీభావం తెలుపుతున్న భట్టి విక్రమార్క
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): నిజాం కాలేజీ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని శాసనసభా ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కళాశాల విద్యార్థి ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనకు శనివారం ఆయన హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ 10 రోజులుగా విద్యార్థినులు ఆందోళన చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు.
నిజాం కాలేజీని అప్పట్లో డిగ్రీ విద్యార్థుల కోసమే నెలకొల్పారని, సీట్లు మిగిలితే డిగ్రీ విద్యార్థులకు ఇచ్చేవారని గుర్తుచేశారు. విద్యార్థులకు సరిపడా భవనాలను నిర్మించకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని భట్టి పేర్కొన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ విద్యార్థులను బెదిరించడం సరికాదని, ఆయన ఒక ఐఏఎస్ అధికారిలా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థుల న్యాయపరమైన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, కత్తి వెంకటస్వామిలతో పాటు కాలేజీ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment