'జనభేరి'కి సీఎం అడ్డంకులు
మహబూబాబాద్, పాల్వంచ, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో ఈనెల 29 నిర్వహించనున్న సకల జనభేరి సభను అడ్డుకునేందుకు సీమాంధ్ర సీఎంగా వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని వేంనూర్ గ్రామ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్తూపాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో కోదండరాం మాట్లాడుతూ.. సకల జనభేరి సభను విజయవంతం చేయడంలో భాగంగా చర్చించేందుకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వెళ్లిన నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. సమావేశానికి అనుమతిచ్చిన హాలు యజమానిని కూడా బెదిరించారన్నారు. హైదరాబాద్‌ను లూటీ చేసేందుకే సీమాంధ్రులు కృత్రిమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని కోదండరాం అన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తే యుద్ధమేనని హెచ్చరించారు. తెలంగాణ ఆర్టీసీ ఆదాయంతోనే ఆంధ్రా డిపోలు నడుస్తున్నాయని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఆంధ్రా డిపోలు ఎత్తివేస్తారనే ఆలోచనతోనే అక్కడి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటపట్టారని పేర్కొన్నారు. పాల్వం చలో కూడా కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కిరణ్‌పై మండిపడ్డారు. ఆయన సీమాంధ్రకే సీఎం అని, తెలంగాణకు ముఖ్యమంత్రి లేడని అన్నారు. భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణలో భాగమేనన్నారు.