
విజయవంతంగా ముగిసిన జనభేరీ, సమైక్య గర్జన
హైదరాబాద్/కర్నూలు: తెలంగాణవాదులు హైదరాబాద్లో సకల జన భేరీ పేరుతో, సమైక్యవాదులు కర్నూలు సమైక్య గర్జన పేరుతో నిర్వహించిన రెండు భారీ బహిరంగ సభలు విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్లో తెలంగాణ సకల జనభేరి సభకు, కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సమైక్య గర్జన సభకు జనం భారీగా తరలి వచ్చారు. రెండు ప్రాంతాలలో పోటాపోటీగా నిర్వహించిన రెండు సభల ప్రాంగణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. సకల జనభేరీ తెలంగాణ నినాదాలతో, సమైక్య గర్జన సమైక్యాంధ్ర నినాదాలతో మారుమ్రోగిపోయాయి.
సకల జనభేరీలో నేతలు మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులు తమ ప్రాంతాలకు వెళ్లిపోవలసిందేన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు. అక్టోబరు 6 తరువాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండరని చెప్పారు. ఆంధ్రా వాళ్లు అందరూ తెలంగాణ ద్రోహులే అని అన్నారు. సమైక్య గర్జనలో మాట్లాడిన నేతలు సమైక్యవాదాన్ని వినిపించారు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరారు. ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.