తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేటోళ్లని, తెలంగాణను అడ్డుకునేటోళ్లనే తాను ద్రోహలని అన్నట్టు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు వివరణ ఇచ్చారు.
సకల జన భేరిలో తన వ్యాఖ్యలపై కేసీఆర్ వివరణ
తన వ్యాఖ్యలను నారాయణ, దత్తాత్రేయ తప్పుపట్టటంపై మండిపాటు
మేం ప్రజలను ఎందుకంటాం? తెలంగాణను అడ్డుకునే వాళ్లనే నిందిస్తం
తెలంగాణ ఉద్యమంపై సీమాంధ్ర నేతల మాటలు మీకు కవిత్వంలా ఉందా?
అక్కడి నేతలు మాట్లాడే రెచ్చగొట్టే మాటలకు ఎందుకు స్పందించలేదు?
ద్రోహం చేసిండ్రు కాబట్టి ద్రోహులు అన్నాం.. నిందించటం ఉద్దేశం కాదు
మీడియా భేటీలో కేసీఆర్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేటోళ్లని, తెలంగాణను అడ్డుకునేటోళ్లనే తాను ద్రోహలని అన్నట్టు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు వివరణ ఇచ్చారు. ‘‘30 -40 ఏళ్ల నుంచి నేను ప్రజల మధ్య ఉన్నా. నన్ను డజనుకు పైగా సార్లు ప్రజలు గెలిపించారు. మేం ప్రజలనెందుకంటామండీ? ప్రజలను అనే అక్కర మాకు ఏముంది? తెలంగాణను అడ్డుకునే వాళ్లని తప్పనిసరిగా కేసీఆర్ నిందిస్తడు. ఎందుకు నిందించమండీ? భాజాప్తా నిందిస్తం. ఒకటి అంటే ఒకటి కాదు వెయ్యి అంటం’’ అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ మంగళవారం పార్టీ నాయకులు కె.కేశవరావు, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, నారదాసు లకష్మణరావు తదితరులతో కలిసి తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సకల జన భేరి సభలో తాను చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ వంటి నేతలు తప్పుపట్టటంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
సీమాంధ్ర నాయకులు గానీ, అక్కడ ఉద్యమంలో పాల్గొంటున్న వారు గానీ తనపై, తెలంగాణ ఉద్యమంపై తీవ్ర విమర్శలు చేసినప్పుడు సైతం మాట్లాడని ఆ ఇద్దరు నేతలు.. తాను మాట్లాడగానే, ఆ మాటలను తప్పుపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలంగాణ వాళ్లు రాక్షస సంతతికి చెందిన వారని విమర్శిస్తే.. అవి ఈ నారాయణ, దత్తాత్రేయకు కవిత్వం పాడినట్టు అనిపించిందా? పయ్యావుల కేశవ్ తాము మానవ బాంబులం అవుతామన్నది కూడా నారాయణకు కవిత్వమే అనిపించిందా?’’ అని వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణకు చెందిన పలువురిపై సీమాంధ్రలోనూ, ఏపీ ఎన్జీవోల సభ సందర్భంగా భౌతికదాడులు జరిగితే.. అదంతా మంచిగా కనిపించిందా? కేసీఆర్ మాట్లాడితే తప్పనిపిస్తోందా మీకు? అవతలి వాళ్లంతా బాగా సంస్కారంగా ఉన్నట్టు, మేం ఒక్క మాట మాట్లాడితే సంస్కా రం తప్పినట్టు కనిపిస్తున్నాది? ఈ వన్ సైడ్ లవ్ ఏంటండి?’’ అంటూ నారాయణ, దత్తాత్రేయలపై విరుచుకుపడ్డారు. ద్రోహం చేసిండ్రు కాబట్టి ద్రోహులు అన్నా...
‘‘మొన్న సభలో ఏం చెప్పిన..? ‘లంకలో ఉన్నవాళ్లని రాక్షసులే అన్నట్టు..’ సామెత చెప్పిన. తెలంగాణలో జనం రొటీన్‌గా వాడే ముచ్చటే అది. నేను వాళ్లని రాక్షసులని అనలే. సీమాంధ్రలో ఉన్న తెలంగాణను వ్యతిరేకించేటోళ్లందరూ తెలంగాణ ద్రోహులే అని చెప్పినం. ద్రోహం చేసిన వాళ్లని ద్రోహులనక ఏమంటమండి? చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చడం ద్రోహం కాదా? తెలంగాణ కోసం ఒప్పుకుంటడు. తెలంగాణ కోసం లేఖ ఇచ్చిన అంటడు. తెలంగాణ రాగానే అడ్డం పడతడు. దానిని ద్రోహం కాకపోతే ఏమంటం? వైఎస్ విజయమ్మ పరకాల ఉప ఎన్నికలకు వచ్చి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తది. అప్పుడేమో చిలకపలుకులు పలుకుతరు.
ఇప్పుడేమో తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చుతరు. దానిని ఏమంటం?’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘పత్రి విమర్శ కిందనే నేను చెప్పిన. ద్రోహం చేసిండ్రు కాబట్టి ద్రోహులు అన్నా. నిందించడం మా ఉద్దేశం కాదు. నారాయణ, దత్తాత్రేయ గారికంటే నాకు మంచి తెలుగు భాష వస్తది. నేను తెలుగు లిటరేచర్ చదువుకున్నా. మాకు భాష లేక, సంస్కారం లేక కాదు. అదే టైంలో నేను ఉద్యమం నడిపిస్తున్నా. మా ప్రజలకు ఆ మాత్రం భరోసా ఇచ్చుకోక తప్పదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘డిసెంబర్ తొమ్మిది నాడు తామే ఆపామని నిన్న లగడపాటి జబ్బలు చరుచుకున్నడు. ఇప్పుడు కూడ బిల్లు రాకుండా ఆపినం అని లగడపాటి మాట్లాడితే.. మేం మూతి ముడుచుకొని ఇంట్లో కూర్చోవాల్నా? ఇదెక్కడి న్యాయం? ఇదేమి నీతి?’’ అని ప్రశ్నించారు. అలా ఎవరు మాట్లాడినా మీడియా హైలైట్ చేయాలి...
‘‘సకల జనభేరి సభ ఊహించిన దానికన్నా పది రెట్లు ఎక్కువ విజయవంతం కావటంతో.. దానిని చూసి ఓర్వలేక ఒక సెక్షన్ మీడియా పనిగట్టుకొని ఇలాంటివి సృష్టించింది. ఆ తరువాత దానిపై కొంత మంది దగ్గరకు పోయి గొట్టాలు (మీడియా మైకులు) పెట్టి మాట్లాడించారు’’ అని కేసీఆర్ విమర్శించారు. తనను మాత్రమే కాకుండా సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా హైలైట్ చేయాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ‘‘సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో కేసీఆర్‌ను నిందించని రోజు ఉందా? ఏమి వెకిలి ఉద్యమం అది?’’ అని తప్పుపట్టారు. ఇలాంటి డ్రామాలతో తెలంగాణ ఆపాలనుకుంటే.. అది జరగదన్నారు. ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇకనైనా ఆంధ్రా నాయకులు అవాకులు చెవాకులు మానుకోవాలన్నారు. ‘‘రేపు రెండు రాష్ట్రాలను ఎవరిది వాళ్లు పాలించుకుందాం. ఒకరికొకరం సహకరించుకుందాం. లేదు, ద్వేషం పెట్టుకుందామంటే మీ ఖర్మ’’ అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ సభను అడ్డుకుంటారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావ సభను తెలంగాణ వాదులు తప్పకుండా అడ్డుకుంటారని కేసీఆర్ హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా బదులిచ్చారు. ‘‘మానుకోట మళ్లీ పునరావృతం కావాలని ఆయన (వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి) కోరుకుంటుండేమో. దానికి ఎవరు బాధ్యు లు? ఏం జరిగినా జరుగుతది’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్లగ్ పీకుతారని తనకు తెలిసిన విషయాన్ని సభలో చెప్పానని.. అది ఎలా జరుగుతుందీ, ఎవరు పీకుతారు అన్నది తెలియదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్టప్రతి పాలన అవకాశాలపై అడిగిన ప్రశ్నకు ‘‘ఏ పరిణామాలైనా సంభవించవచ్చు.
ఎవరిథింగ్ ఈజ్ పాజిబుల్’’ అని స్పందించారు. తెలంగాణ బిల్లుకు సంబంధించిన కేబినెట్ నోట్ విషయంపై తనకేమీ తెలియదన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను బట్టి తాను తెలంగాణ వద్దనుకుంటున్నట్టు.. చంద్రబాబు తెలంగాణ కావాలనుకుంటున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఇలాంటి తలాతోక లేని విమర్శలకూ ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టే మీడియా పరిస్థితి ఏమిటో తెలుస్తోందన్నారు. జగƒ న్‌మోహన్‌రెడ్డితో తాము కుమ్మక్కు కావాల్సిన అవసరం ఏముంటుందని మరో విలేకరి ప్రశ్నకు కేసీఆర్ ఎదురు ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే అంశంపై మాట్లాడేందుకు ఇది సందర్భం కాదన్నారు.