సాక్షి, హైదరాబాద్: ‘సకల జన భేరి’ పేరిట సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లో అవగాహన సదస్సును నిర్వహించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన శనివారం జరిగిన జేఏసీ విస్తృత స్థాయి భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని చేయాలనే నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నట్టు జేఏసీ ప్రకటించింది. ఎలాంటి పరిమితులు, షరతులు లేకుండా హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. సీమాంధ్ర పరిపాలనా అవసరాల కోసం మాత్రమే దాన్ని తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా మాత్రమే చేయాలని, అంతేగాక ‘తాత్కాలిక ఉమ్మడి రాజధాని’ అనే ప్రస్తావనను కేబినెట్ తీర్మానంలో, పార్లమెంటు బిల్లులో కూడా స్పష్టం చేయాలని కోరింది. ఈ మేరకు పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కూడా జరగాలని తీర్మానించింది. భేటీ నిర్ణయాలను కోదండరాం, జేఏసీ నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, విఠల్ తదితరులు మీడియాకు వివరించారు.
హైదరాబాద్‌పై అవగాహన కోసమే సకల జన భేరిని తలపెట్టామన్నారు. దాన్ని నిజాం కాలేజీ మైదానంలో జరపాలన్న యోచన ఉందని, నిర్ణయం ఇంకా తీసుకోలేదని వివరించారు. హైదరాబాద్‌తో కలిపి 10 జిల్లాలతో తెలంగాణ కోసం కేంద్ర కేబినెట్‌లో తీర్మానం చేయాలని, పార్లమెంటులో వెంటనే బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినంగా జరపాలని పేర్కొన్నారు. ఆ రోజు జాతీయ జెండాను, తెలంగాణ జేఏసీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 22న వికారాబాద్‌లో అవగాహన సభ, ర్యాలీ నిర్వహిస్తామని, జిల్లాలవారీగా సన్నాహక సకల జనభేరీ సభలు, ర్యాలీలు చేపడుతున్నామని వివరించారు. గుంటూరులో మంద కృష్ణ మాదిగ నిర్వహించబోయే సభకు సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి 45 రోజులు దాటుతున్నా ఆచరణలో ఒక్క అడుగూ ముందుకేయలేదని విమర్శించారు. బిల్లుకు జాప్యం చేయడమే రెండు ప్రాంతాల ప్రజల మధ్య శాశ్వత వైషమ్యాలు పెరిగే పరిస్థితులకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ సమైక్య పార్టీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సమైక్య రాష్ట్రం కోసం పని చేస్తోందని కోదండరాం విమర్శించారు. వైఎస్సార్‌సీపీ సమైక్య పార్టీ అయితే టీడీపీ అటూ ఇటూ కాకుండా అస్పష్ట వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీని అమలు చేయించుకోవడంలో ఆ పార్టీకి చెందిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి అధిష్టానంపై కాంగ్రెస్ నేతలే ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7న ఏపీ ఎన్జీవోలు హైదరాబాద్‌లో నిర్వహించిన సభ సీమాంధ్రులు, సీఎం కిరణ్ కలసికట్టుగా చేసిన కుట్రలో భాగమేనని ఆరోపించారు. తెలంగాణ రాకుండానే హోర్డింగులు, ఫ్లెక్సీలతో సంబరాలు చేసుకుంటున్న తెలంగాణ మంత్రులు, అధిష్టానం ప్రకటించిన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఎందుకు అమలు చేయించడం లేదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్‌లో సభ పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. సంబరాలు జరుపుకునే నైతికహక్కు కాంగ్రెస్‌నేతలకు లేదన్నారు.
రాష్ట్రపతి పాలన విధించాలి: బీజేపీ
సీమాంధ్ర ముఖ్యమంత్రి, పాలకుల చేతిలో విభజన జరిగితే తెలంగాణకు న్యాయం జరగదని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ రాజేశ్వర్‌రావు అన్నారు. అసెంబ్లీని రద్దుచేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పాటయ్యే దాకా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని న్యూ డెమొక్రసీ నేతలు కె.గోవర్ధన్, పోటు రంగారావు సూచించారు. వెయ్యిమంది తెలంగాణలో యువకులు ఆత్మబలిదానం చేసుకుంటే చంద్రబాబునాయుడు ఎక్కడ ఉన్నాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భేటీలో కె.కేశవరావు, ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి (టీఆర్‌ఎస్), అశోక్ యాదవ్, ఎన్.వేణుగోపాలరెడ్డి, సుధాకర శర్మ (బీజేపీ), జేఏసీ నేతలు అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్, మామిడి నారాయణ, గోపాలశర్మ, జిల్లా జేఏసీల అధ్యక్షులు, వివిధ సంఘాల బాధ్యులు కూడా పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను ఎందుకు మోస్తున్నట్టు?: కేకే
తెలంగాణపై ప్రకటన తప్ప ఆచరణలో ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీని ఎందుకు అభినందిస్తున్నారంటూ జేఏసీ సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు అంతర్గతంగా నిలదీశారు. ‘‘తెలంగాణపై ఎన్నోసార్లు హామీ ఇచ్చి మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని సోనియాగాంధీతోనే ఎన్నోసార్లు ప్రశ్నించాను. కాంగ్రెస్ అధిష్టానం తీరుతో విసిగిపోయి నాతో పాటు ఎంపీలం ఆ పార్టీకి రాజీనామా చేసినం. ఇప్పడు కూడా ప్రకటనే చేసింది తప్ప అమలు చేయలేదు. ఆ పార్టీని ఎలా నమ్ముతాం? మరోసారి మోసం చేయదని గ్యారంటీ ఏముంది? తెలంగాణ ఏర్పాటు కాకుండానే కాంగ్రెస్‌ను, ప్రకటనను అమలు చేయించలేని అసమర్థులను ఎందుకు అభినందిస్తున్నారు? తెలంగాణ జేఏసీలో ఉంటూ, ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన పార్టీలను కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కిరణ్ సర్కారును ఎందుకు మైనారిటీలో పడేస్తలేరు?’’ అంటూ కేకే సీరియస్‌గా ప్రశ్నించినట్టు తెలిసింది.
29న సకల జన భేరి: టీ జేఏసీ
Published Sun, Sep 15 2013 12:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement