సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలతో తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని, అందులో...
కందుకూరు,న్యూస్‌లైన్: సీమాంధ్ర పెట్టుబడిదారుల కుట్రలతో తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని, అందులో భాగంగానే హైదరాబాద్‌ను యూటీ చేయాలంటున్నారని జేఏసీ రంగారెడ్డి జిల్లా తూర్పు విభాగం చైర్మన్ వెదిరె చల్మారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ జోలికొస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సకల జన భేరి సమావేశానికి సన్నాహకంగా మండల కేంద్రంలోని విద్యామయి కళాశాలలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఇదే రోజు భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కబ్జా చేసిన భూములు, అక్రమంగా కొల్లగొట్టిన ఆస్తులను కాపాడుకోవడానికే సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్రా అంటూ కృత్రిమ ఉద్యమానికి తెరలేపారని మండిపడ్డారు. మరోపక్క తెలంగాణకు అనుకూలమని ప్రకటించిన పార్టీలు యూ టర్న్ తీసుకోవడాన్ని దుయ్యబట్టారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటూ చంద్రబాబు, సమైక్యాంధ్రా అంటూ జగన్, యూటీ అంటూ చిరంజీవి వంటి నేతలు ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. 29న నిర్వహించనున్న సకలజనభేరి సభను విజయవంతం చేయాలని, ప్రతి కుటుంబం నుంచి ఒక్కరైనా సమావేశానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి బొక్క నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. 2009లో వచ్చిన ప్రకటనను ఆపిన విధంగానే మళ్లీ సీమాంధ్ర నేతలు కుట్రలు పన్నుతున్నారన్నారు. తెలంగాణ వాదులంతా జాగ్రత్తగా ఉండి వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రాజకీయ పార్టీలు స్వార్థంతో పనిచేస్తున్నాయని, రెండు రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కప్పాటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. పదకొండు వందల మంది విద్యార్థులు ఆత్మత్యాగాలు చేసుకున్న ఫలితమే తెలంగాణ కల సాకారమవ్వడానికి కారణమన్నారు. సీమాంధ్రులు రెండు లక్షల ఉద్యోగాలను అక్రమంగా దోచుకున్నారని, భాష, యాసను అవమానపరుస్తూ తెలంగాణ సంసృ్కతిపై దాడి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జేఏసీ మహేశ్వరం నియోజకవర్గం కన్వీన ర్ అశోక్, బీజేపీ మండల ప్రధానకార్యదర్శి సాధ మ ల్లారెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమేష్‌గౌడ్, విద్యామయి కళాశాల ప్రిన్సిపాల్ బాల్‌రాజ్, ఏబీవీపీ భాగ్ కన్వీనర్ మహేందర్ తదితరులున్నారు.