తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని...
ఖమ్మం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో జేఏసీ తలపెట్టిన సకల జనభేరికి జిల్లానుంచి వేలాదిగా తరలి వెళుతున్నారు.తెలంగాణ ప్రకటన వెలువడినా పార్లమెంట్‌లో బిల్లు పెట్టే విషయంలో కాంగ్రెస్ నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ వాదులు భారీగా సకల జనభేరిని నిర్వహిస్తున్నారు.
దీనిని విజయవంతం చేయడానికి జేఏసీలు, రాజకీయ పార్టీలు అన్ని వర్గాల వారిని సన్నద్ధం చేశాయి. ఇప్పటికే జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లందు, మధిర, మణుగూరు, సత్తుపల్లి, భద్రాచలం ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్, టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్, జేఏసీ రాష్ట్ర నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య, గోవర్థన్‌లతోపాటు పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకురాలు విమలక్క జిల్లాలో పర్యటించి సకలజన భేరికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే వారం రోజులుగా సభలు,సమావేశాలతోపాటు నిర్వహిస్తున్న సాంస్కృతిక ప్రచార కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.
జిల్లా నుంచి 25వేల మంది తరలింపు
సకల జనభేరి సభకు జిల్లానుంచి 25వేలమందిని తరలిస్తున్నట్లు జేఏసీ నాయకులు కూరపాటి రంగరాజు, కనకాచారి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో సీమాంధ్ర నాయకులు మోకాలడ్డటం, సీడబ్ల్యూసీ ప్రకటనను వెనక్కు తీసుకునేలా కుట్రలు పన్నడాన్ని నిరసించడంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ఈ సభ ద్వారా తెలపాలని జేఏసీ పిలుపునిచ్చిందని వివరించారు. ఆదివారం ఉదయం ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి 100 బస్సులలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక వర్గాలతోపాటు తెలంగాణ జేఏసీలో అంతర్భాగమైన అన్ని రాజకీయ పక్షాల వారు బయలుదేరతారని తెలిపారు. వీరితోపాటు మరో 200 ప్రైవేట్ వాహనాలు, లారీల ద్వారా వేలాదిగా తరలివచ్చేందుకు ఇప్పటికే తెలంగాణ వాదులు సిద్ధమయ్యారని చెప్పారు. జిల్లా మీదుగా వెళ్లే శాతవాహన, కోణార్క్, గోల్కొండ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు, భద్రాచలంరోడ్ లైన్‌ద్వారా డోర్నకల్ నుంచి వెళ్ళే రైళ్లలో పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులు తరలి వెళుతున్నట్లు తెలిపారు. సత్తుపల్లి, ఇల్లందు, తదితర ప్రాంతాలలోని సింగరేణి కార్మికులు జనభేరికి భారీగా తరలి వెళ్ళనున్నట్లు కార్మిక సంఘాల నేతలు తెలిపారు. బోనకల్, మధిర తదితర ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో తెలంగాణవాదులను తరలిస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు.