సాక్షి ప్రతినిధి, బెంగళూరు/ దావణగెరె, న్యూస్‌లైన్ : కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం సీమాంధ్ర, తెలంగాణ విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో చిచ్చు పెట్టిందని బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. దీంతో దక్షిణ భారతదేశానికి వస్తున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌కు వెళ్లే దమ్ము లేకుండా పోయిందని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికలకు సన్నాహకంగా మోడీ మంగళవారం మంగళూరు, దావణగెరెల్లో పాల్గొన్న బహిరంగ సభలకు భారీ స్పందన లభించింది. ‘భారత్‌ను గెలిపించండి’ పేరిట ఈ సభలు ఏర్పాటయ్యాయి. మంగళూరులోని సెంట్రల్ మైదాన్‌లో జరిగిన బహిరంగ సభలో వేలాది మందిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ అభివృద్ధి అజెండాను ఆవిష్కరించారు.
‘మోడీ...మోడీ...మోడీ లావో...దేశ్ బచావో’ అని కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా ఆయన వేదిక వద్దకు చేరుకున్నారు. తుళు భాషలో ప్రసంగాన్ని ప్రారంభించగానే మైదానం ఈలలు, కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. గతంలో తాను ఇదే మైదానంలో ప్రసంగించినప్పుడు పెద్ద సంఖ్యలో జనం లేరని, ఈరోజు అంతా నిండిపోయిందని సంతోషం వ్యక్తం చేశారు. విమానాశ్రయం నుంచి మైదానం వద్దకు వస్తున్నప్పుడు తాను రోడ్డుకు ఇరువైపులా మానవ గోడలను చూశానని అన్నారు. తన పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఇది నిదర్శనమని అన్నారు. అనంతరం కాంగ్రెస్‌పై ధ్వజమెత్తుతూ, ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని దుయ్యబట్టారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ అదే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఆ పార్టీ పాలనలో దేశం ఆర్థికంగా దివాళా తీసిందని, యువత నిరుద్యోగులుగా మారారని దుయ్యబట్టారు.
దావణగెరె సభలో మోడీ మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని వాగ్దానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ విభజన చిచ్చు పెట్టిందని, దీంతో అక్కడి ప్రజలు ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఈ విభజనపై ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ వారికి ప్రజల కష్టసుఖాలతో పని లేదని, ఇలాంటి కాంగ్రెస్‌కు చిన్నపాటి శిక్ష సరిపోదని, దేశం నుంచే ఆ పార్టీని తరిమి వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో నకిలీ గాంధీలు అధికమయ్యారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రులు బీఎస్.యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు ఆర్.అశోక్, కేఎస్.ఈశ్వరప్ప, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్, బీజేపీ రాష్ట్రధ్యక్షులు ప్రహ్లాద్‌జోషి తదితరులు పాల్గొన్నారు.
ఆ చిచ్చు కాంగ్రెస్‌దే
Published Wed, Feb 19 2014 6:08 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement