హైదరాబాద్ మాదంటే.. మాదే
'సేవ్ ఆంధ్రప్రదేశ్' నేపథ్యంలో.. ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోలు మాటకు మాట తూటాల్లా పేల్చుకుంటున్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఇంకా ఉందని, అందువల్ల రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో సమావేశం పెట్టుకోడానికి తమకు పూర్తి హక్కు ఉందని సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కన్వీనర్ యు. మురళీకృష్ణ వాదించారు. తాము సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ పెట్టుకున్న రోజునే వాళ్లు శాంతి ర్యాలీ పెట్టాలనుకోవడం సరికాదని, కావాలనుకుంటే అంతకంటే ఒకటి రెండు రోజుల తర్వాత, లేదా అది అవమానకరం అనుకుంటే ఒకటి రెండు రోజుల ముందే నిర్వహించుకోవచ్చు గానీ సరిగ్గా అదే రోజున ర్యాలీ పెట్టి, తమ వేదిక వద్దకే వస్తామని చెప్పడం అశాంతి సృష్టించడం తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు.
వాళ్లు అంటున్నట్లుగా తాము పక్కింట్లో వెళ్లి సమావేశం పెట్టుకోవట్లేదని, రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్లోనే పెట్టుకుంటున్నామని చెప్పారు. సొంతిల్లు అనాలంటే నరేంద్రరావు కూడా ఆయన సొంత ఊరైన దేవరకొండలోనే సమావేశం పెట్టుకోవాలి తప్ప హైదరాబాద్ రావడానికి వీల్లేదని, ఇప్పటికే ఖమ్మం, నల్లగొండ ప్రాంతాల్లో తమవాళ్లను అడ్డుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇది సరికాదని, తాము నిర్వహిస్తున్న సభ ఎవరికీ వ్యతిరేకం కాదని.. కేవలం అవగాహన సభ మాత్రమేనని వెల్లడించారు.
దీనిపై తెలంగాణ ఉద్యోగుల సమన్వయ సంఘం కన్వీనర్ నరేందర్‌రావు కూడా దీటుగా స్పందించారు. హైదరాబాద్ నగరంలో అందరినీ ఉండాలనే చెబుతున్నాం గానీ, ముమ్మాటికీ ఈ నగరంపై పెత్తనం మాత్రం తమదేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన భూమిపుత్రులదే ఇక్కడ పెత్తనమని కుండ బద్దలుకొట్టారు. కలిసుండాలనుకుంటున్న 13 జిల్లాల్లో ఎక్కడైనా కావాలంటే సభ నిర్వహించుకోవచ్చు గానీ.. పక్కింటికొచ్చి అక్కడ సభ పెట్టుకుంటామంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు. వాళ్లు (ఏపీ ఎన్జీవోలు) సమావేశం నిర్వహించుకున్నంత మాత్రాన మిన్ను విరిగి మీద పడేది ఏమీ లేదని, ఇన్నాళ్లూ కొంతవరకు సంఘర్షణాత్మక వైఖరి ఉన్నా.. ఎందుకొచ్చిందని తాము ఊరుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ప్రక్రియ ఎటూ ముందుకెళ్లేదే తప్ప వెనక్కి జరిగేది కాదని, ప్రత్యేకరాష్ట్రం సిద్ధించి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు.