తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావడానికి అధిక సమయం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని టీఎన్జీవోలు ప్రకటించారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావడానికి అధిక సమయం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని టీఎన్జీవోలు ప్రకటించారు. సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అధ్యక్షతన మంగళవారం టీఎన్జీవో భవన్‌లో కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం వివరాలను టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె.రవీందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. అందులోని ముఖ్యాంశాలు..
తెలంగాణ ఏర్పాటు కేవలం ఉద్యోగులకు కాదు. అన్ని వర్గాల ప్రజల కోసం. తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రోజూ అదనంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
తెలంగాణ రాష్ట్రాన్ని అమరవీరులకు అంకితం చేయాలి. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలి. రాజకీయ జేఏసీ చైర్మన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం, వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలి.
సీమాంధ్ర ఉద్యోగుల పట్ల ఘర్షణ వాతావరణం ఉంది. వారి మీద వ్యతిరేకత లేదు. మా ఉద్యోగాలు, ప్రమోషన్లను కొల్లగొట్టడం వల్లే 1969 నుంచి తెలంగాణ ఉద్యోగుల్లో ఆవేదన ఉంది, అందుకే ఉద్యమించారు.
హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుందంటూ కొన్ని పార్టీలు చేసిన ప్రచారంలో వాస్తవం లేదు. అందరూ స్వేచ్ఛగా ఉండవచ్చు. అయితే ఇతరుల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.
స్థానికత ఆధారంగా ఉద్యోగుల, పెన్షనర్ల విభజన జరగాలి. మొత్తం ఉద్యోగాల్లో 42 శాతం తెలంగాణకు, 58 శాతం సీమాంధ్రకు పంచాలి. మా వాటా 42 శాతంలో పూర్తిగా తెలంగాణ ఉద్యోగులే ఉండాలి. ఇప్పటికే మా ఉద్యోగాలు కొల్లగొట్టడం వల్ల తీవ్రమైన అన్యాయాన్ని భరించాం, పెన్షనర్ల భారాన్ని కూడా తెలంగాణ మీద నెడితే అంగీకరించం. సీమాంధ్ర పెన్షనర్లకు మేం వ్యతిరేకం కాదు. స్థానికత ఆధారంగానే పెన్షనర్ల విభజన జరగాలి.
ప్రైవేటు ఉద్యోగుల్లో 80-90 శాతం మంది తెలంగాణేతరులే ఉన్నారు. ఇక మీదట ప్రైవేటు రంగంలో 80 శాతం ఉద్యోగాలు తెలంగాణవారికే ఇవ్వాలి.
మార్చి 31 నాటికి కొత్త పీఆర్సీ అమలుచేయాలి. హెల్త్‌కార్డుల స్టీరింగ్ కమిటీ ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. రెండు రాష్ట్రాలకు రెండు స్టీరింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, వెంటనే పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి.
సీఎం రాజీనామా తర్వాత కూడా ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన జీవోలు వచ్చాయి. ఈ నెల 19 తర్వాత వెలువడిన జీవోలను రద్దు చేయాలి.
మార్చి 15 నుంచి 30 వరకు తెలంగాణవ్యాప్తంగా తెలంగాణ పునర్నిర్మాణ సభలు నిర్వహిస్తాం. ఏప్రిల్ తొలివారంలో హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు, మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో సదస్సు ఏర్పాటుచేస్తాం.