పీఆర్సీకి టీ-ఎన్జీవోల ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం చెల్లిస్తున్న గ్రాట్యుటీని రూ.15 లక్షలకు పెంచాలని టీఎన్జీవోలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 69 శాతం ఫిట్‌మెంట్‌తో జీతాలు చెల్లించాలని, కనీస వేతనం రూ. 15 వేలుగా నిర్ధారించాలని కోరారు. పదోపీఆర్సీ అమలు ఆలస్యమవుతున్నందున ఉద్యోగులందరికీ 45 శాతం మధ్యంతర భృతిని వెంటనే చెల్లించాల్సిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని పీఆర్సీ చైర్మన్‌ను కోరారు.
గతంలో తాము చేసిన ప్రతిపాదనలపై వివరణ ఇచ్చేందుకు టీఎన్జీవోలు బుధవారం సచివాలయంలో పీఆర్సీ చైర్మన్ పీకే అగర్వాల్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో పీఆర్సీకి అందజేసిన ప్రతిపాదనలను వెల్లడించారు. 610 జీవోకు విరుద్ధంగా, అక్రమ డిప్యుటేషన్లపై హైదరాబాద్‌లో కొనసాగుతున్న సీమాంధ్ర ఉద్యోగులందరూ విభజన తరవాత తిరిగి వారి ప్రాంతానికి వెళ్లాల్సిందేనన్నారు. టీఎన్జీవోల ప్రతిపాదనల్లో ప్రధానమైనవి...
వచ్చే ఏడాది ప్రారంభం నుంచైనా పీఆర్సీని అమల్లోకి తేవాలి.
పీఆర్సీ అలస్యమైనందున ఉద్యోగులందరికీ 45 శాతం ఐఆర్ వెంటనే చెల్లించాలి.
నాలుగో తరగతి ఉద్యోగికి కనీస వేతనం రూ.15 వేలుగా నిర్ధారించాలి.
ఇంక్రిమెంట్ 3 శాతం కంటే తక్కువ కాకూడదు. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీంను
అమలుజేయాలి.
అంత్యక్రియల ఖర్చును రూ. 10 వేల నుంచి రూ. 25వేలకు పెంచాలి, ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే పది రోజుల ప్రత్యేక సెలవులు కేటాయించాలి.
హైదరాబాద్ హెచ్‌ఎండీఏ పరిధిలో హెచ్‌ఆర్‌ఏను 30 శాతం చెల్లించాలి. జిల్లా కేంద్రాల్లో 25 శాతం, 50 వేల జనాభా దాటిన పట్టణాల్లో 18.5 శాతంగా నిర్ధారించాలి.
పదవీ విరమణ వయసును 60కి పెంచాలి. పెన్షనర్లకు హెచ్‌ఆర్‌ఏ. పెన్షన్ వృద్ధి వయస్సును 75 నుంచి 65 సంవత్సరాలకు తగ్గించాలి.
హైదరాబాద్‌లో 5 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టాలి.
మహిళల సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల్లో గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి.
పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సెంట్రల్ అసోసియేషన్ పీఆర్సీకి విజ్ఞప్తి చేసింది. అలాగే వారానికి ఐదు రోజుల పనివిధానాన్ని ప్రవేశపెట్టాలని కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఇ.వెంకటేశం నేతృత్వంలో టి.ప్రభాకర్, సుధాకర్, రాంశెట్టి, పవన్‌కుమార్ తదితరులతో కూడిన ప్రతినిధిబృందం బుధవారం పీఆర్సీ చైర్మన్ అగర్వాల్‌తో చర్చలు జరిపింది. పెన్షన్ నిర్ధారణకు ఆఖరు నెల వేతనంలో డీఏను కూడా కలపాలని, గెజిటెడ్ అధికారులకు బస్‌పాస్ సౌకర్యం లేనందున పెట్రోల్ అలవెన్స్ ఇవ్వాలని ఈ బృందం కోరింది.