
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల పోటాపోటీ నినాదాలు, ఉద్రిక్తత
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీఎన్జీవో, టీఎన్జీవోల నినాదాలతో రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు మారుమోగుతున్నాయి. సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న నిరసనలు, ధర్నాలను అక్కడక్కడా తెలంగాణ ఉద్యోగులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరుప్రాంతాల ఉద్యోగులు పోటాపోటీగా నిరసనలు తెలుపుతుండడంతో కార్యాలయాల్లో పాలన పూర్తిగా స్తంభించిపోతోంది.
ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేం దుకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆయన సీమాంధ్ర ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా తెలంగాణ ఉద్యోగులు గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ‘అన్నదమ్ముల్లా ఉంటున్న ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టేందుకు వచ్చావా’ అంటూ ఆయన్నుఘెరావ్ చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు వారిని తోసేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి తులసిరెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు.
ఏపీఎన్జీవో నేతల అరెస్టు
సమైక్యాంధ్రను కోరుతూ విద్యుత్‌సౌధలో మంగళవారం భోజన విరామ సమయంలో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. వీరికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఏపీఎన్జీవోస్ నగర అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఇరిగేషన్ అసోసియేషన్ నగర అధ్యక్షుడు బి.మల్లికార్జున్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బీమా భవన్‌లో ధర్నా
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ మంగళవారం అబిడ్స్ తిలక్‌రోడ్డులోని బీమాభవన్‌లో ఏపీ ఎన్జీవోలు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. కోఠి డీఎంహెచ్‌ఎస్‌లోని కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం, డీఎంఈ, వైద్యవిధానపరిషత్, ఏపీసాక్, డీహెచ్ తదితర శాఖల సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి మౌనప్రదర్శనలో పాల్గొన్నారు. అదే సమయంలో టీఎన్జీఓలు ఒక్కసారిగా కార్యాల యాల నుంచి బయటకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.