సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: ఏపీ ఎన్జీవోలు
సాక్షి, హైదరాబాద్ : సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు ఆలస్యమయ్యే కొద్దీ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీవోలు హెచ్చరించారు. సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి బుధవారం ఏపీ ఎన్జీవోల కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికైనా రాజీనామాలు చేసి రాజకీయాలకతీతంగా ఉద్యమంలోకి రావాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సూచించారు. తమ ప్రసంగాలపై అభ్యంతరాలుంటే చర్చకు సిద్ధమని ప్రకటించారు. తమ నాలుకలు కోస్తామంటూ తెలంగాణ నాయకులు చేస్తున్న హెచ్చరికలను ఖండించారు. ‘నాలుకలు కోస్తే మూగవాళ్లం అవుతాం.
కాళ్లు విరగ్గొడితే వికలాంగులమవుతాం. కళ్లు పీకేస్తే అంధులం అవుతాం. మేం ఏమైనా, మమ్మల్ని ఏం చేసినా సరే సమ్మెను కొనసాగించి తీరతాం. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాష్ట్ర విభజనను అడ్డుకుంటాం’ అని స్పష్టంచేశారు. ‘మా నాలుకలు కోయాలంటే మా దగ్గరకు రావాలి. మా దగ్గరకు వస్తే మేం చేతులు ముడుచుకుని కూర్చోం’ అని అన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే తమ ప్రాంత ప్రజల మనోభావాలూ దెబ్బతింటాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. హిందూపురం సభలో తమ మాటలను వక్రీకరించారని ఆరోపించారు. హైదరాబాద్ అందరిదీ అనే అర్థంలోనే తాము మాట్లాడామన్నారు. తెలంగాణ ప్రజలు, ప్రాంతం అంటే తమకు ప్రేమ ఉందన్నారు. సచివాలయ ఉద్యోగులు ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారని, తెలంగాణ నోట్ వచ్చే సమయంలో తాము కూడా దేశ రాజధానికి తరలివెళ్లి ధర్నా చేయాలనే యోచనలో ఉన్నామన్నారు.
రేపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి
నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఈ నెల 27న ముట్టడించనున్నట్లు ఏపీఎన్జీవోల నగర అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ వెల్లడించారు. గన్‌ఫౌంఢ్రీలోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన చేపడితే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఆ రోజున ముట్టడిని పోలీసులు అడ్డుకుంటే 28న జైల్‌భరో కార్యక్రమాన్ని చేపడతామన్నారు.