'ప్రజాభిప్రాయాన్ని కాదని విభజిస్తే సివిల్ వార్ తప్పదు'
నాగార్జున సాగర్: అసెంబ్లీకి తీర్మానం వస్తుందో.. రాదో చెప్పలేని వారు దేశాన్ని ఏమి ఉద్ధరిస్తారని ఏపీఎన్జీవోల నేత అశోక్ బాబు మండిపడ్డారు. సమైక్య ఉద్యమంలో నేతలు కొట్టుకుపోతారని ఆయన విమర్శించారు. నాగార్జున్ సాగర్ లో ఏర్పాటు చేసి సభలో అశోక్ బాబు ప్రసంగించారు. ప్రజాభిప్రాయాన్ని కాదని విభజిస్తే సివిల్ వార్ తప్పదని ఆయన హెచ్చరించారు. పార్టీ ఆఫీసుల్లో కుర్చుని లేఖలు రాస్తే విభజన జరిగిపోతుందా? అని ఆయన ప్రశ్నించారు. పరిపాలించమని మాత్రమే ఓటేశామని.. విడదీయమని కాదని తెలిపారు. హైదరాబాద్ నగరం ప్రజలందరిదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని అశోక్ బాబు సవాల్ విసిరారు. ప్రస్తుతం పాలిస్తున్న పాలకులకు అసెంబ్లీ తీర్మానం వస్తుందో..రాదో తెలియడం లేదని అశోక్ బాబు ఎద్దేవా చేశారు.
ఇరు ప్రాంతాల్లో ఉన్న సమస్యలు తీర్చి..రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన ప్రభుత్వానికి విజ్క్షప్తి చేశారు. రాష్ట్రాన్ని విభజించే హక్కు పార్లమెంట్ కు ఉందని విచక్షణ కోల్పోయి విభజించడం సరికాదన్నారు.