'స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమం'
ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు మంగళవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. రేపు సీఎం కిరణ్తో చర్చలు జరుపుతామన్నారు. అనంతంర తమ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అలాగే తాము మరోసారి ఉద్యోగ సంఘాలన్నింటితో చర్చలు జరుపుతామన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సొంత జిల్లా విజయనగరంలో జరిగిన దాడులను అశోక్బాబు ఈ సందర్భంగా ఖండించారు.
ఈ నెలాఖరున న్యూఢిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జాతీయ నాయకులను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగగా జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. సీమాంధ్రలోని విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెతో ఆ ప్రాంతంలో అంధకారం అలుముకుందన్నారు. కరెంటు కష్టాలతో సీమాంధ్ర ప్రజలు అల్లాడుతుంటే ఎంపీలు ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమని అశోక్బాబు పేర్కొన్నారు.
సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో సీఎం కిరణ్ చర్చలు జరుపుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సమైక్య ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీల ఇళ్ల ముందు ధర్నాలు నిర్వహిస్తాన్నారు. అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 10వ తేదీన భీమవరం పట్టణంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అశోక్బాబు వెల్లడించారు.