సాక్షి, హైదరాబాద్: ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మెను కొనసాగించేందుకు సీమాంధ్ర ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు సిద్ధమయ్యాయి. ఇక నుంచి ఆందోళనను ఉధృతం చేయాలని, రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించాయి. సమైక్యంపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు, ఎంత కాలమైనా సమ్మె కొనసాగించడానికి సిద్ధమని ప్రకటించాయి. ఈ మేరకు 11వ తేదీవరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. దాదాపు 150 ఉద్యోగ, కార్మిక సంఘాలు, పలు ప్రజా సంఘాలతో కూడిన ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ సమావేశం సోమవారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగింది. భేటీ అనంతరం ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు.. సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎన్‌ఎంయూ సీమాంధ్ర నేతలు ప్రసాద్, రమణారెడ్డి, మోహన్, ఈయూ నేత దామోదరరావు తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.
- అక్టోబర్ 15 వరకు ఉద్యోగ, కార్మిక వర్గాలన్నీ సమ్మె కొనసాగిస్తాయి. 15న మళ్లీ అన్ని సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తారు.
- రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న చిరుద్యోగులు, కార్మికులకు బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు ఇప్పించడానికి ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నించాలి. ఉద్యమంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్యోగులు తమవంతు సహకారం అందించాలి.
- చర్చలకు రమ్మని ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందినా.. మంత్రివర్గ ఉపసంఘం స్థాయిలో చర్చలకు వెళ్లడం వల్ల ఫలితం లేదు. సమస్యలు తెలుసుకొనే స్థాయిలో కాకుండా.. వాటిని పరిష్కరించగలిగే స్థాయిలోనే చర్చలు జరగాలి. అందువల్ల ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిగితేనే వెళ్లాలి.
- ఆంటోనీ కమిటీ కేవలం పార్టీ కమిటీనే. దానికి ప్రాధాన్యత లేదని దిగ్విజయ్‌సింగ్ పరోక్షంగా చెప్పారు. అందువల్ల దానికి నివేదిక ఇవ్వకూడదు.
- పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి విధించిన గడువు పొడిగించాలి. దసరా సెలవులు లేకుండా సిలబస్ పూర్తి చేయాలి. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి కార్యాచరణ నిర్ణయించాలి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక సంఘాలు కూడా సమైక్య ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. వారూ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం వల్ల కేంద్రం మీద ఒత్తిడి పెరిగింది. అందుకే ఎంపీల రాజీనామాలు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారు. కార్యాచరణ ఇదీ..
ఊఅక్టోబర్ 2న గాంధీ విగ్రహాలు ఉన్న చోట్ల శాంతి ర్యాలీలు, నిరసన దీక్షలు
ఊ3, 4 తేదీల్లో 48 గంటలపాటు సీమాంధ్రలోని ఎంపీల ఇళ్ల ముందు ధర్నాలు, దీక్షలు. అక్కడే వంటావార్పూ కూడా చేపడతారు. ధర్నాల్లో వేలాది మంది ఉద్యోగులు పాల్గొనే విధంగా జిల్లా స్థాయిలో ప్రణాళిక రూపొందించాలి
ఊ5న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రహదారుల దిగ్బంధం.. 5, 6 తేదీల్లో ప్రైవేటు ట్రావెల్‌స, పెట్రోల్ బంక్‌ల బంద్
ఊ7, 8 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల దిగ్బంధం.. వాటి ముందు ధర్నాలు
ఊ9, 10, 11 తేదీల్లో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ధ ధర్నాలు. జాతీయ నాయకులను కలిసి విభజనకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురమ్మని విజ్ఞప్తి చేయాలని నిర్ణయం
సమ్మె కొనసాగిస్తాం : అశోక్‌బాబు
Published Tue, Oct 1 2013 12:50 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement