ఏపీఎన్జీవోల సంఘం పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అప్రజాస్వామికంగా బిల్లును లోక్‌సభ ముందుకు తేవడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర ప్రజలంతా ఈ బంద్‌లో పాల్గొనాలని కోరారు. ఈ బంద్‌కు అన్ని రాజకీయ, ప్రజా, విద్యార్ధి, కార్మిక సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... మెజార్టీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా, చట్టసభల సంప్రదాయాలను పట్టించుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేంద్రం, విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయనేమన్నారంటే...
విభజనను అడ్డుకునేందుకు ఇప్పటికే అనేక పోరాటాలు చేశాం. ప్రస్తుతం ఆఖరి పోరాటం చేస్తున్నాం. విభజన బిల్లును జాతీయ సమస్యగా భావించి అన్ని పార్టీలు పార్లమెంట్‌లో అడ్డుకోవాలి. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, కేంద్ర మంత్రులతో భేటీలు జరిపి సభలో బిల్లును అడ్డుకునే అంశమై చర్చలు జరిపాం. బిల్లును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తామని వారు హామీ ఇచ్చారు. పార్లమెంట్‌ను స్తంభింపజేసి బిల్లు రాకుండా రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు శక్తిమేర ప్రయత్నించాలి. రాష్ట్రానికి చెందిన సీమాంధ్ర మంత్రులు ఢిల్లీకి రావాలని కోరాం. వారు ఇక్కడికి వచ్చాక కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించేలా కార్యాచరణ రూపొందిస్తాం. ఈ నెల 17న ఇక్కడి రాంలీలా మైదానంలో సుమారు 20వేల మందితో మహాధర్నా నిర్వహిస్తాం. దీనిద్వారా విభజన వ్యతిరేకతను ఢిల్లీకి చాటుతాం.
కావూరి, పురందేశ్వరిలతో భేటీ..
బిల్లును లోక్‌సభలో అడ్డుకునే విషయమై అశోక్‌బాబు బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరిలను విడివిడిగా కలిసి చర్చించారు. కాగా.. ఏపీఎన్జీవోల బంద్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) సమైక్యాంధ్ర పోరాట కమిటీ స్పష్టం చేసింది.
బంద్ విజయవంతానికి వైఎస్సార్ సీపీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: విభజనను వ్యతిరేకిస్తూ ఈనెల 13న జరుగనున్న సమైక్య బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. ఢిల్లీ గుండెలు అదిరేలా సమైక్య నినాదం వినిపిస్తూ ఈ బంద్‌లో ముందుండాలని తమ పార్టీ శ్రేణులను ఆదేశించినట్లు కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ ప్రజాస్వామిక చరిత్రలోనే ఒక రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా విభజించే యత్నం, ఒక జాతిని చీల్చే యత్నం మరెన్నడూ జరుగలేదని పేర్కొంది. ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగు జాతి ఆత్మగౌరవానికి మధ్య పోరాటమని, ఈ పోరాటంలో అందరూ కలిసి ఢిల్లీ విభజన వాదంపై దండెత్తాలని పార్టీ పిలుపు నిచ్చింది.
నేడు సీమాంధ్ర బంద్
Published Thu, Feb 13 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement
Advertisement