హైదరాబాద్: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులతో మంత్రవర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశమైంది. విధులకు హాజరుకాకుండా సమ్మెను తీవ్రరూపంలోకి తీసుకువెళ్లిన ఉద్యోగులు సమ్మె విరమించాలని మంత్రి వర్గ ఉపసంఘం కోరనుంది. ఏపీఎన్జీవోలు ఎవరితోనైనా తాము చర్చలకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సమావేశమైంది. కాగా, సమావేశానికి ఏపీఎన్జీవోలు, రెవిన్యూ ఉద్యోగుల సంఘం గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొండ్రు మురళీ తదితరులు పాల్గొని ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నారు.
ఈ రోజు ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏపీఎన్జీవోల సమ్మె చట్టవిరుద్దమంటూ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాన్ని శుక్రవారం కూడా విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టుకు ఏపీఎన్జీవోలు తమ వాదనలు వినిపించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వ్యాఖ్యానించింది. సమ్మె చేయడం వల్ల ఎవరికా లాభం కలుగుతోందని హైకోర్టు ఉద్యోగులను ప్రశ్నించింది. సమ్మె విరమించుకుంటారా లేదా స్పష్టంగా రేపటిలోగా చెప్పాలని ఏపీఎన్జీవో, సెక్రటేరియట్ ఉద్యోగులను హైకోర్టు ఆదేశించింది. సమ్మె పిటిషన్పై రేపు కూడా వాదనలు కొనసాగే అవకాశాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీఎన్జీవోలు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ సమ్మెతో సీమాంధ్రలోని ప్రభుత్వ కార్యాలయాలన్ని మూతపడ్డాయి. ఏపీఎన్జీవోలు చేప్టటిన సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైన సంగతి తెసిందే.