దేవాదాయ శాఖలో ఉద్యోగుల ఘర్షణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనరేట్‌లో ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమైక్యాంధ్ర, విభజనకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్న సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఉద్యోగుల మధ్య.. ఇతర శాఖల ఉద్యోగులు వారి ఆందోళనల్లో పాల్గొనవద్దనే ఒప్పందం కుదిరింది.
అయితే ఏపీఎన్జీవోలు ఈ ఒప్పందాన్ని మీరి ఇతర శాఖల వారిని పిలిపించుకుని సమ్మె నిర్వహిస్తున్నారంటూ దేవాదాయ శాఖ తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖలోని ఇరుప్రాంతాల ఉద్యోగులు ఒకరినొకరు దూషించుకున్నారు. పెద్ద సంఖ్యలో ఇరు పక్షాలు తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. వారు పక్కపక్కనే ఆందోళనలు నిర్వహించడంతో వారి మధ్య తీవ్ర తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఒకరికొకరు తలపడేందుకు యత్నించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనలు విరమించాలని ఇరువర్గాలనూ ఆదేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.