కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంతో జిల్లాలో ఆర్థిక స్తంభన ఏర్పడింది. ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. నెలరోజులుగా అలుపెరగకుండా పోరాడుతున్నారు. జీతాలు లేకపోయినా సరే ఏదో విధంగా బతుకుతాం... అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు నిరవధిక సమ్మెలో కొనసాగుతున్నారు. నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నా అన్ని వర్గాల ప్రజలు సమైక్య ఉద్యమంలో పాల్గొంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు అండగా నిలుస్తున్నారు. రాజకీయ సహకారం లోపించినా సమైక్య ఉద్యమం నెల రోజులు విజయవంతంగా జరిగిందనే అభిప్రాయం అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.
పభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడం ద్వారా ఆర్థికంగా బలహీనపరిస్తే విభజన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉందని భావించిన ఉద్యోగ, ప్రజాసంఘాలు ప్రభుత్వ ఆదాయాన్ని భారీగా దెబ్బతీశాయి. ఒక్క కర్నూలు జిల్లా నుంచి ప్రభుత్వ ఆదాయానికి దాదాపు 82 కోట్లు గండి పడింది. జిల్లాలో దాదాపు 60 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఉన్నారు. వీరిలో పోలీసులు, మరికొంతమంది విధులు నిర్వహిస్తున్నా దాదాపు 45 వేల మంది సమ్మెలో ఉన్నారు. జిల్లా ట్రెజరీ పూర్తిగా బంద్ కావడం వల్ల ఆగస్టు నెల జీతాలు ఎవ్వరికీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే 30 వేల మంది పెన్షనర్లు కూడా పెన్షన్ పొందలేని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, జ్యుడీషియల్‌కు జీతాలు ఇవ్వాలని ట్రెజరీ డీడీపై ఒత్తిడి పెరుగుతోంది. ఇటు జేఏసీ నేతలు ఎవ్వరికీ ఇవ్వరాదని తెస్తుండటంతో ట్రెజరీ డీడీకి ఎటూ పాలు పోని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో దాదాపు వంద కోట్ల రూపాయలు జీతాలు, పెన్షన్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ విషయంపై శనివారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తిరగని బస్సులు.. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొనడంతో 970 బస్సులు డిపోకు పరిమితం అయ్యాయి. ఆగస్టు నెల మొత్తం మీద ఆర్టీసీ దాదాపు రూ.30 కోట్లు నష్టం వాటిల్లింది.
పభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కీలకమైంది. ఆగస్టు నెలలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.17.50 కోట్లు రావాల్సి ఉంది. విభజన నిర్ణయం ప్రకటించిన రోజు నుంచి అటెండర్ మొదలుకొని సబ్ రిజిస్ట్రార్‌ల వరకు ఆందోళనలు నిర్వహిస్తుండటంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. వాణిజ్య పన్నుల శాఖ నుంచి వ్యాట్, అమ్మకపు పన్ను తదితర వాటి ద్వారా ఆగస్టు నెలలో రూ.27 కోట్లు రావాల్సి ఉంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఆన్‌లైన్ ద్వారా వ్యాట్ చెల్లిస్తుండటం వల్ల 50 శాతం మాత్రమే ఆదాయం వచ్చింది.
వాహనాల రిజిస్ట్రేషన్లు, రోడ్డు ట్యాక్స్ తదితర రూపాల్లో ఆదాయం రూ.12 కోట్లు రావాల్సి ఉన్నా సిబ్బంది సమ్మెలో ఉండటం వల్ల ఆదాయం భారీగా పడిపోయింది. అలాగే గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి లీజులు రాయల్టీలు, జరిమానాలు తదితర వాటి ద్వారా జిల్లా నుంచి ఈ నెలలో రూ.5 కోట్లు రావాల్సి ఉన్నా కోటి రూపాయలు కూడా రాలేదు. రూ.4 కోట్లకు పైగా ఆదాయానికి గండిపడింది. రెవెన్యూ శాఖ ద్వారా ప్రభుత్వానికి నాల, వన్‌టైమ్ కన్వర్షన్ తదితర రూపాల్లో ఆదాయం వస్తుంది. రెవెన్యూతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు రూ.7 కోట్ల మేర గండి పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
నిలిచిన ప్రజాపంపిణీ...
సమైక్య ఉద్యమం కారణంగా సెప్టెంబర్ నెల ప్రజాపంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. 10.5 లక్షల కుటుంబాలు సెప్టెంబర్ నెల సరుకులు పొందలేకపోతున్నారు. సరుకులు అందకపోయినా రాష్ట్రం సమైక్యంగా ఉంటే కడుపు నిండినట్లేనన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
ఆర్థిక స్తంభన
Published Sat, Aug 31 2013 4:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement
Advertisement