సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది. సకలజనుల సమ్మెగా రూపాంతరం చెందిన తర్వాత ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ నగరం నుంచి పల్లె వరకూ అన్నివర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఉద్యోగ, విద్యార్థి, వ్యాపార, కార్మిక సంఘాలు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. బస్సులు తిరగక పోవడం, వ్యాపార సంస్థలు మూతపడటంతో జనజీవనం స్తంభించింది. అయినా భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఉద్యమానికి సహకారం అందిస్తున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వెలువడిన జూలై 30వ తేదీ తరువాత సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది.
ఉన్నతాధికారులు మినహాయిస్తే ఉద్యోగులు, సిబ్బంది అందరూ ఆందోళనబాట పట్టారు. ఈనెల 12న అర్ధ రాత్రి నుంచి ఉద్యోగులు, కార్మికులు, ఎన్జీఓలు సకలజనుల సమ్మె చేపట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులెవరూ రాకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. చేసేదేమి లేక ఉన్నతాధికారులు సైతం కార్యాలయాలకు రావడం మానేశారు. మరోవైపు ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీమాంధ్రలోని 13 జిల్లాలో ఎన్జీఓ ప్రతినిధులు శుక్రవారం గుంటూరులో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ఉద్యమాన్ని మరింత హోరెత్తించాలని తీర్మానించారు.
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై ప్రభావం
ఈనెల 19వ తేదీ నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. రెవెన్యూ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోయింది. ఈ క్రమంలో కౌన్సెలింగ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు సోమవారం నుంచి జిల్లాలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకుని ఉద్యమం నుంచి స్కూళ్లకు మినహాయింపు ఇస్తూ జేఏసీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు తెరిచినా ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషిస్తామని ప్రైవేటు స్కూళ్ల యజమానులు ప్రకటించారు. బస్సులు తిరగకపోవడంతో ఆర్టీసీపై ప్రభావం చూపుతోంది. రోజూ రూ.90 లక్షల వరకు నష్టం వాటిల్లుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
స్తంభించిన జనజీవనం
Published Sat, Aug 17 2013 5:04 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement