19 ఏళ్ల క్రితం దీపావళి ఆనందాలను చిదిమేసిన బాంబు పేలుళ్లు | Delhi Blast 19 Years Completed | Sakshi
Sakshi News home page

19 ఏళ్ల క్రితం దీపావళి ఆనందాలను చిదిమేసిన బాంబు పేలుళ్లు

Published Tue, Oct 29 2024 12:29 PM | Last Updated on Tue, Oct 29 2024 1:27 PM

Delhi Blast 19 Years Completed

న్యూఢిల్లీ: ఈరోజు (అక్టోబరు 29) దేశ చరిత్రలో ఒక విషాద సంఘటన నమోదైంది. 19 ఏళ్ల క్రితం ఇదేరోజున ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లు దీపావళి ఆనందాన్ని హరింపజేశాయి.  

అక్టోబర్ సాధారణంగా ఢిల్లీలో పండుగల సీజన్. మొదట రామలీల ‍ప్రదర్శనలు తరువాత దసరా కోలాహలం ఇది ముగిసిన వెంటనే ధన్‌తేరస్ షాపింగ్, దీపావళి, చివరిగా గోవర్ధన పూజ, భయ్యా దూజ్... ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పండుగలు వస్తూనే ఉంటాయి. ఈ   నేపధ్యంలో మార్కెట్‌లలో కొనుగోలుదారుల సందడి నెలకొంటుంది.

2005 అక్టోబరు 29న ధన్‌తేరాస్ నాడు ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. రద్దీగా ఉండే మార్కెట్లలో జరిగిన ఈ పేలుళ్లలో 60 మంది మరణించగా, 200 మందికి పైగా జనం గాయపడ్డారు. నాడు ఢిల్లీలోని సరోజినీ నగర్, పహర్‌గంజ్, కల్కాజీ ప్రాంతాల్లోని మూడు చోట్ల డీటీసీ బస్సుల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో చాలా మంది అయినవారిని కోల్పోయారు. నేటికీ సరోజినీ నగర్ మార్కెట్‌లోని దుకాణదారుల నాటి ఘటనను గుర్తుకు తెచ్చుకుని భయపడుతుంటారు.

30 ఏళ్లుగా సరోజినీ నగర్ మార్కెట్‌లో దీపావళి వస్తువులు విక్రయిస్తున్న ఓ దుకాణదారుడు నాటి రోజును గుర్తు చేసుకుంటూ మీడియాతో మాట్లాడారు. నేటికీ నాటి భయానక దృశ్యం కళ్ల ముందు మెదులుతోందని, ఆరోజు ధన్‌తేరస్‌ రోజు కావడంతో మార్కెట్‌ అంతా కొనుగోలుదారులతో నిండివుందన్నారు. పేలుడు సంభవించినప్పుడు తాను ఘటనా స్థలానికి సమీపంలోని తన కొవ్వొత్తుల దుకాణంలో ఉన్నానని, అకస్మాత్తుగా భారీ పేలుగు శబ్ధం వచ్చి, అంతటా చీకటి అలుముకుందన్నారు. తొలుత తాను దుకాణంలో అమర్చిన బల్బు  పేలివుంటుందని భావించానని తెలిపారు. అయితే ఆ పేలుడులో తన తలకు బలమైన గాయమైందని, స్పృహలోకి వచ్చేసరికి అక్కడ కుప్పలుగా పడి ఉన్న మృతదేహాలను చూసి భయపడ్డానన్నారు. బాంబు పేలుడు సంభవించిన దుకాణం యజమాని మృతదేహం రెండు భాగాలుగా విడిపోయి కనిపించిందన్నారు. నాటి ఘటనతో పలువురు సజీవదహనమయ్యారని అతను ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్‌’ ఇకలేదు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement