నేటి నుంచి రిలే దీక్షలు
Published Sun, Aug 25 2013 3:39 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
రావులపాలెం, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం నుంచి జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి తెలిపారు. జగన్ దీక్షకు మద్దతుగా జిల్లాలోని పార్టీ శ్రేణులు నేటి నుంచి రిలే దీక్షలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. శనివారం రావులపాలెంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జగన్ దీక్షకు మద్దతుగా జిల్లాలోని వైఎస్సార్ సీపీ నేతలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, సీజీసీ, సీఈసీ సభ్యులు, మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల కన్వీనర్లు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో రిలే దీక్షలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. సమైక్యవాదులందరూ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసేందుకు ప్రయత్నించి తీరు అందరినీ తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇటీవల విజయమ్మ దీక్షకు మద్దతుగా తాము చేపట్టిన బస్సుయాత్రకు కోనసీమ జేఏసీ మద్దతు తెలిపిందన్నారు. జేఏసీలు అన్నీ కలసి విజయమ్మ నేతృత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నాయని ఆయన తెలిపారు. ప్రజల అభిమానాన్ని చూరగొన్న విజయమ్మ దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
జిల్లాలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వచ్చిందన్నారు. వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం వైఎస్సార్ సీపీ పాటుపడతోందన్నారు. సమైక్యాంధ్ర కోసం తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. తొమ్మిది సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు బస్సుయాత్ర ప్రకటించి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారన్నారు.
టీడీపీ ధ్వంధ్వ వైఖరి, రెండు నాలుకల విధానాన్ని ప్రజలు గుర్తించారని చిట్టబ్బాయి విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రజాపక్షాన పోరాటం చేస్తుందన్నారు. వైఎస్సార్ పీపీ కొత్తపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం టౌన్ కన్వీనర్ మట్టపర్తి నాగేంద్ర, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పీఎస్‌రాజు, గొలుగూరి మునిరెడ్డి, బొక్కా వెంకటలక్ష్మి, మండల కన్వీనర్లు తమ్మన శ్రీను, దొమ్మేటి అర్జునరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement