సాక్షి, నెల్లూరు: విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌జీఓలు చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో మంగళవారంతో ఆరో రోజుకు చేరింది. ఎన్‌జీఓలు, సమైక్యవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, మోటారు బైక్ ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రాష్ట్ర విభజనకు పూనుకుంటే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవన్నారు. సమైక్యాంధ్ర సాధించేవరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.
పాణ త్యాగాలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు. ఎన్‌జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. నెల్లూరు నగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగులు ఎన్‌జీఓ భవన్ నుంచి మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా థియేటర్లను మూయించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్‌సీ కూడలిలో విద్యార్థులు యూపీఏ దిష్టి బొమ్మను దహనం చేశారు. కావలిలోఎన్‌జీఓ నేతలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు.
పొట్టిశ్రీరాములు విగ్రహం సెంటర్ ట్రంకురోడ్డుపై రాస్తారోకో చేశారు. దీంతో వాహనాల రాక పోకలకు అంతరాయం కలిగింది. వాకాడులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక అశోక్‌స్తంభం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. దీంతో రాకపోకలు స్తంభించాయి. వెంకటగిరిలో సమైక్యాంధ్రకు మద్దతుగా, జయప్రకాష్ నారాయణపై తెలంగాణ వాదులు దాడిని నిరసిస్తూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుంచి పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.
నిరసన జ్వాల
Published Wed, Feb 12 2014 2:51 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement