రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 16 నుంచి రైతులతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటామని వ్యవసాయశాఖ, అనుబంధ శాఖల అధికారులు నిర్ణయించారు.
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 16 నుంచి రైతులతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటామని వ్యవసాయశాఖ, అనుబంధ శాఖల అధికారులు నిర్ణయించారు. బుధవారం స్థానిక రైతుబజార్ సమీపంలోని కృషిభవన్‌లో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, ఏపీఎంఐపీ, పశుసంవర్ధకశాఖ అధికారులు, అసోసియేషన్ నేతలు సమావేశమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్న విభజన నిర్ణయం వల్ల సీమాంధ్ర ప్రాంతంలో సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల ప్రజల స్థితిగతులు దారుణంగా దెబ్బతింటాయన్నారు. 15 రోజులుగా ప్రజలు, ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఉద్యమానికి బాసటగా నిలుస్తామని తెలిపారు. అందులో భాగంగా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున రైతులను సమీకరించి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించారు. 16న నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ ఎన్జీఓ సమ్మెలో భాగంగా సీమాంధ్ర జిల్లాల్లో తమ శాఖల అధికారులు పాల్గొనేలా తమ వంతు చర్యలు తీసుకుంటామని నేతలు పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ కె.సాంబశివరావు, ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ రంగస్వామి, ఉద్యానశాఖ ఏడీ బీవీ రమణ, పశుసంవర్ధకశాఖ డీడీ డాక్టర్ జయకుమార్, ఆయా శాఖల అధికారులు వాసుప్రకాశ్, వెంకటప్రసాద్‌యాదవ్, చెన్నవీరాస్వామి, శ్రావణ్, చంద్రశేఖర్ హాజరయ్యారు.