మహిళలతో కళకళలాడుతున్న దుకాణాలు
ఈ నెల 16న వరలక్ష్మీ వ్రతం
అలంకరణ అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అందులోనూ సృజనాత్మకతను జోడిస్తూ.. మనసారా వేడుకుంటూ చేసే వరలక్ష్మి వ్రతాల్లో అలంకరణే ప్రత్యేక ఆకర్షణ. సిరుల తల్లి కట్టురొట్టు నుంచి నైవేద్యం వరకూ ప్రతిదీ కొత్తగా ఉండాలనుకుంటారు. అమ్మవారితోపాటు దీపాలు, కలశాలు, ముత్తయిదువులకు ఇచ్చే తాంబూలాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని కొనేందుకు మహిళలు చొరవ చూపడంతో మార్కెట్ కళకళలాడుతోంది.
కడప కల్చరల్: సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో శ్రీవరలక్ష్మీ వ్రతం ప్రధానమైనది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ నెల 16న శుక్రవారం ఈ వ్రతం నిర్వహించనున్నారు. ఇళ్లలో పవిత్ర కలశాన్ని ప్రతిష్టించి అమ్మవారి మూర్తిని దానిపై ఉంచి పూజలు చేస్తారు. ఇప్పటి నుంచే వ్రతానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు మహిళలు చొరవ చూపుతున్నారు. దీంతో గత వారం రోజులుగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాలు, చిల్లర సరుకులు వంటి అనేక వ్యాపార సముదాయాలు కొనుగోలుదారులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. అనేక పెద్ద, చిన్న వస్త్ర వ్యాపారులు శ్రావణమాసం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించటంతో మహిళలు కొనుగోలు చేయటానికి రావటంతో కళకళలాడుతున్నాయి.
బంగారం.. కొనుగోలుకు ఆసక్తి
కలశం వద్ద కొత్తగా కొన్న బంగారు వస్తువులను ఉంచడం ఆనాటి సంప్రదాయంగా వస్తోంది. పండగ నాటికి బంగారం ఖరీదు పెరుగుతుందనే భావనతో మహిళలు ముందే కొద్దో గొప్పో బంగారం కొనుగోలు చేస్తారు. ఈ పండగ కోసమని బంగారు వ్యాపారులు ప్రత్యేకంగా తక్కువ ధర గల చిన్న వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవి రూపం గల బంగారు కాసులు, చిన్న డాలర్లు, అమ్మవారి రూపాలను ఒకటి నుంచి రెండు, మూడు గ్రాముల బరువుగల వస్తువులను విక్రయాలకు సిద్ధం చేశారు. వాటితోపాటు వెండితో చేసిన అమ్మవారి ముఖ రూపాలను అందుబాటులో ఉంచారు.
కాసులు, బరువును బట్టి రూ. 2000 నుంచి రూ. 7,000 వరకు విక్రయిస్తున్నారు. బంగారు కాసులు, ముక్కు పుడకలు, చిన్న డాలర్లు, చిన్న కమ్మలకు గిరాకీ ఉందని జ్యువెలరీ దుకాణాల యజమానులు తెలిపారు. ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతం కోసం మహిళలు చిన్న వస్తువులైనా కొంటారని తెలిపారు. దీనికి తోడు గత రెండు, మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈ శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు ఎక్కువగా ఉండడంతో వ్యాపారం జోరందుకున్నదని వ్యాపారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment