తెలుగును రాజేస్తున్న నిప్పు కణిక  | A young Tamil Girl who has a Party Membership for speech in Telugu | Sakshi
Sakshi News home page

తెలుగును రాజేస్తున్న నిప్పు కణిక 

Published Wed, Apr 17 2019 1:39 AM | Last Updated on Wed, Apr 17 2019 1:39 AM

A young Tamil Girl who has a Party Membership for speech in Telugu - Sakshi

తెలుగులో ప్రసంగించినందుకు పార్టీ సభ్యత్వాన్ని కోల్పోయిన ఒక తమిళనాడు యువతి అక్కడి తెలుగు జాతిని ఏకం చేసేందుకు, అన్ని రంగాలలోనూ తమిళులతో సమానంగా తెలుగువారికీ అవకాశాలు కల్పించేందుకు ఉద్యమించారు. ఎన్నికల తరుణం కావడంతో సహజంగానే ఆమె పోరాటానికి విస్తృతంగా మద్దతు లభిస్తోంది.

ఓ సినిమాలో ముస్లిం యువకుడు ‘నేను ఇక్కడే పుట్టాను. ఈ దేశం నాది. నీకెంత హక్కుందో నాకంతే హక్కుంది. ముస్లిములు అందరూ తీవ్రవాదులు కాదు. మేరా భారత్‌ మహాన్‌’ అంటాడు. ఇప్పుడు అదే అస్తిత్వం కోసం పోరాడుతూ.. ‘ఇదే నా మాతృభాష. ఇదే నా జన్మభూమి’ అంటూ.. ‘నేను తెలుగు.. నా భాష తెలుగు. ఇక్కడే పుట్టా. ఇదే నా ప్రాంతం. భారతీయురాలిగా నేను నా భాషలో మాట్లాడే హక్కును ఎందుకు కోల్పోవాలి?’ అని నినదిస్తున్నారు ఓ మహిళ! నిర్బంధ తమిళంలో భాష పేరిట జరుగుతున్న వేధింపులపై గళమెత్తిన ఆ తెలుగు మహిళ ధనమణి వెంకట్‌

ఇప్పుడు తమిళనాట ఓ సంచలనం! 
ధనమణి తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఆమెది వలస వెళ్లిన తెలుగు కుటుంబం కాదు. తొలి తరం నుండి అక్కడి కుటుంబమే. ఆ ఇంట్లో మొదటి మహిళా గ్రాడ్యుయేట్‌ ధనమణి. ఆమె భర్త వెంకట్‌ వ్యాపారంలో స్థిరపడ్డారు. అదే సమయం వైగో (వైపురి గోపాలస్వామి) నేతృత్వంలోని ఎండిఎంకె (మురుమలర్చి ద్రవిడ మన్నేట్ర కళగం) లో కీలక కార్యకర్తగా ఉన్నారు. ఆయన ద్వారానే ధనమణి ఎండిఎంకెలో మంచి వక్తగా ఎదిగారు. అధికార ప్రతినిధిగా ప్రచారాలలో, బహిరంగ సభలలో ఆమె గొంతుక అగ్గిని రాజేసే నిప్పుకణికగా మారింది.

ఆమె మైక్‌ పట్టుకుంటే ప్రతిపక్షాలకు హడల్‌. ఆమె తమిళంలో ఎంత అనర్గళంగా ప్రసంగిస్తారో.. పుట్టినగడ్డ తమిళ పరిమళంతో కూడిన మాతృభాష తెలుగులో కూడా అదే ఒరవడితో ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరి 27న కోయంబత్తూరు ఎండిఎంకె బహిరంగసభ జరిగింది. ఆ స¿¶ కు ధనమణి ముఖ్య అతిథిగా హాజరై అనర్గళంగా ఉపన్యసించారు. అంతా బాగానే ఉంది. సభకు హాజరైన వారంతా కోయంబత్తూరు, పొల్లాచ్చి ప్రాంతాలకు చెందిన తెలుగు వారు. దీంతో ఆమె తెలుగులో ప్రసంగించారు. అదే ఇప్పుడు వివాదంగా కొనసాగుతోంది.

ధనమణి ఏం మాట్లాడారు?
ఆమె తన ప్రసంగంలో తెలుగువారి గొప్పదనం గురించి మాట్లాడారు. ‘‘తెలుగువాళ్లం అంటే వలస వచ్చిన జీవులం కాదు. ద్రవిడనాడు అంటే.. కేవలం తమిళ భాష, ఒక్క తమిళ ప్రాంతం మాత్రమే కాదు. తెలుగుతో కలిపి నలభై నాలుగు భాషల సమాహారం. ఆరుకోట్ల తమిళుల్లో మూడు కోట్ల తెలుగు అనుబంధం ఉంది. చోళులు, పల్లవులు, తిరుమలై నాయకర్లు, ఆదీనాలు, శైవ మఠాలు, పన్నెండు మంది ఆళ్వార్లు అంతా కలిసి ఉన్నారు.  వందల ఏళ్లనాటిది ఈ తమిళ, తెలుగు సమిష్టి బంధం. ఐదవ శతాబ్దంలోనే తెలుగు భాష ఆనవాళ్లు ద్రవిడ భూమిలో వెలుగు చూశాయి. తమిళులకు ఎంత హక్కు ఉందో ఇక్కడే పుట్టి ఇక్కడే మట్టిలో కలిసిపోయే మనకూ అంతే హక్కు ఉంటుంది.

అలాగని మనం తమిళులకు వ్యతిరేకం కాదు. కొందరు వేర్పాటువాద నాయకులు తెలుగు వారిని ఇక్కడి నుండి తరిమి వేయాలని కుట్ర పన్నుతున్నారు. తమిళుల్లో మమేకమై, ఒక బంధంగా కొనసాగుతున్న తెలుగు వారిలో చీలిక తేవాలనే కుట్రకు మనం బలి కావద్దు. అన్ని రంగాల్లో తెలుగు వారికి సమాన అవకాశాలు తెచ్చుకుందాం. ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో రాణిద్దాం’’ అంటూ మాతృభాషపై మమకారంతో తన సహజమైన ఆవేశంతో ప్రసంగించారు ధనమణి. 

మూడు నెలలుగా వేధింపులు
అయితే ఆమె తెలుగులో ప్రసంగించటం.. తమిళం, ఈలం తమిళం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే ‘నామ్‌ తమిళర్‌’ పార్టీ వ్యవస్థాపకుడు సీమాన్‌ను అగ్గిమీద గుగ్గిలం అయ్యేలా చేసింది. అంతే.. ‘‘ధనమణి తమిళ ద్రోహి. తెలుగులో మాట్లాడటం ద్వారా తమిళులను చులకన చేసింది. తమిళనాట తెలుగు వారి పెత్తనం, దౌర్జన్యం సాగదు’’ అంటూ  సభల్లో తెలుగుపై విషం కక్కాడు. అలా.. ఆనోటా ఈనోటా.. ధనమణి ప్రసంగాలపై తమిళ వ్యతిరేక ఆరోపణలు రాష్ట్రమంతటా వ్యాపించాయి. ఈ క్రమంలో తమిళ నినాదం ఎక్కడ దెబ్బతింటుందోనన్న ఆందోళనలో ఎండిఎంకె అధినేత వైగో ఆమెను పార్టీ పదవి నుండి సస్పెండ్‌ చేశారు. ధనమణి వైగో నిర్ణయంపై ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. తాను తప్పుగా మాట్లాడలేదని, అదే విషయంపై వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా ఆమె ప్రకటించారు. కానీ.. నామ్‌ తమిళర్‌ పార్టీకి చెందిన కొందరు ధనమణిని తీవ్రమైన, అసభ్యమైన పదజాలంలో మానసిక క్షోభకు గురిచేశారు.

ఫోన్‌ల ద్వారా, వాట్సప్, ఫేస్‌ బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అతి జుగుప్సాకరంగా ధనమణిని వేధింపులకు గురిచేశారు. దీంతో ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో పైకి వస్తున్న మహిళగా గుర్తింపు పొందిన ధనమణి ఇమేజ్‌ని శాశ్వతంగా భూస్థాపితం చేసేందుకు నామ్‌ తమిళర్‌ ప్రయత్నిస్తోంది. గత మూడు నెలలుగా ఈ వేధింపులు భరించలేక  ధనమణి.. తేని, కోవిల్పట్టి, కోయంబత్తూరులోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల వేళ కనుక ధనమణి ఫిర్యాదుపై పోలీసుల విచారణకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ధనమణి ఈ విషయాన్ని తేలిగ్గా వదలదలచుకోలేదు.

తమిళనాడులోని తెలుగు సంఘాల వేదికగా నిలిచిన ‘తమిళనాడు తెలుగు మక్కల్‌’ పార్టీ సాయంతో తనపై బురదజల్లె వారిపై పోరాడుతానంటూ రంగంలోకి దిగారు. వందల వేల సంవత్సరాలుగా ఒక్కటై బతుకుతున్న ద్రవిడ భూమిలో నా మాతృభాషను మాట్లాడుకునే హక్కును నేనెందుకు వదులు కోవాలంటూ ఉద్యమించారు. అంతేకాదు.. వందల ఏళ్లుగా కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్న తమిళ, తెలుగుల నడుమ చిచ్చుపెట్టే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే వేర్పాటు వాదులు ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉందని అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాదు..తమిళనాట తెలుగు వారందరినీ ఒకేతాటిపైకి తెచ్చి తెలుగు వారి బలాన్ని చూపించటం ద్వారా ప్రభుత్వంలో, రాజకీయాల్లో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సమాన హక్కులను పొందేలా కార్యాచరణకు ధనమణి శ్రీకారం చుడుతున్నారు. 

సంజయ్‌ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి
సాక్షి టీవీ, చెన్నై బ్యూరో 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement