కరడు గట్టిన హిందుత్వవాదంతో పుట్టుకొచ్చిన శివసేనకు తిరుగుబాట్లు కొత్త కాదు. పార్టీ గతంలో మూడుసార్లు రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంది. తొలి మూడు పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే హయాంలో జరిగాయి. తాజాగా ఏక్‌నాథ్ షిండే సంక్షోభం ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ పగ్గాలు చేపట్టాక తొలి తిరుగుబాటు. 1966లో హిందూత్వ పునాదులపైనే బాల్‌ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేన 56 ఏళ్ల చరిత్రలో ఎదుర్కొన్న రాజకీయ సంక్షోభాలు, అసంతృప్త నాయకులెరో చూద్దాం...
నారాయణ్ రాణే
శివసేన అధినేత బాల్ ఠాక్రే ఏరి కోరి 1999 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని చేసిన నారాయణ రాణె ఆ తర్వాత ఠాక్రేకు పక్కలో బల్లెంలా మారారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో పట్టున్న ఈ నాయకుడు పార్టీలో శాఖ ప్రముఖ్ స్థాయి నుంచి అంచెలంచెలుగా సీఎంగా ఎదిగారు. శివసేనని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో బాల్‌ఠాక్రే 2005లో పార్టీ నుంచి ఆయనను బహిష్కరించారు. ఆ తర్వాత రాణె కాంగ్రెస్‌లో చేరి 12 ఏళ్లు కొనసాగి ఎలాంటి ప్రాధాన్యం దక్కక తిరిగి బీజేపీలో చేరారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు.
చగన్ భుజ్‌బల్
1991 సంవత్సరంలో శివసేనకి చగన్ భుజ్‌బల్ రూపంలో సంక్షోభం ఎదురైంది. పార్టీలో ఓబీసీ నాయకుడైన భుజ్‌బల్ గ్రామీణ మహారాష్ట్రలో పార్టీ పటిష్టతకు తీవ్రంగా కృషి చేశారు. అప్పట్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లు లభించడానికి చగన్ భుజ్‌బల్ అలుపెరుగని కృషి చేశారు. అయినప్పటికీ పార్టీ అధినేత బాల్ ఠాక్రే మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి మనోహర్ జోషిని నియమించారు. మనస్తాపానికి గురైన భుజ్‌బల్ 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ వీడారు. ఠాక్రే మంత్రాంగంతో 12 మంది ఎమ్మెల్యేలు తిరిగి సేన గూటికి చేరుకోవడంతో సంక్షోభం సమసిపోయింది. ఆ తర్వాత కాలంలో ఎన్‌సీపీలో చేరిన భుజ్‌బల్ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
రాజ్ ఠాక్రే
2006 సంవత్సరంలో తన సొంత కుటుంబం నుంచే బాల్‌ఠాక్రేకు వ్యతిరేకత ఎదురైంది. బాలాసాహెబ్ తదనంతరం పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారన్నదానిపై అంతర్గత పోరు నడిచింది. బాల్‌ఠాక్రే సోదరుడు శ్రీకాంత్ ఠాక్రే కుమారుడైన రాజ్ ఠాక్రే పార్టీ పగ్గాలను ఆశించారు. బాల్‌ఠాక్రే వారసుడిగా తననే ప్రకటించాలని పట్టుపట్టారు. కానీ బాలాసాహెబ్ తన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే వైపే మొగ్గు చూపించారు. రాజ్‌ఠాక్రేకి పార్టీలో ప్రాధాన్యం తగ్గించారు. దీంతో రాజ్‌ఠాక్రే 2005లో పార్టీకి రాజీనామా చేసి , 2006లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో కొత్త పార్టీ స్థాపించారు.
ఏక్‌నాథ్ షిండే
ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన ఏక్‌నాథ్ షిండే చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యాక కుమారుడు ఆదిత్య ఠాక్రేకి అధిక ప్రాధాన్యమిస్తుండటం షిండేకు మింగుడుపడలేదు. చివరికి తన శాఖ వ్యవహారాల్లో కూడా ఆదిత్య ఠాక్రే జోక్యం చేసుకుంటూ ఉండటం అసంతృప్తికి ఆజ్యం పోసింది. శివసేనలో కింద స్థాయి నుంచి ఎదిగిన షిండేకి పార్టీపై మంచి పట్టు ఉంది. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలైన కొన్ని గంటల్లోనే షిండే తిరుగుబావుటా ఎగురవేశారు. 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచి శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Maharashtra Political Crisis: శివసేన..సంక్షోభ సేన
Published Thu, Jun 23 2022 5:26 AM | Last Updated on Thu, Jun 23 2022 5:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment