Rajasthan Congress crisis: కాంగ్రెస్‌లో ఎడారి తుఫాన్‌ | Rajasthan political crisis: Congress effectively has no high command | Sakshi
Sakshi News home page

Rajasthan Congress crisis: కాంగ్రెస్‌లో ఎడారి తుఫాన్‌

Published Wed, Sep 28 2022 5:27 AM | Last Updated on Wed, Sep 28 2022 10:06 AM

Rajasthan political crisis: Congress effectively has no high command - Sakshi

ఎస్‌.రాజమహేంద్రారెడ్డి:
 చిన్న చిన్న సమస్యలను సంక్లిష్టం చేసి పీకల మీదికి తెచ్చుకోవడం కాంగ్రెస్‌ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకోవడమంటే ఇదే! ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలతో రాజస్తాన్‌ రాజకీయాలు ముడిపడటం.. వైరి వర్గాలు తెగేదాకా లాగడం కాంగ్రెస్‌ పార్టీ గందరగోళ వ్యవహార శైలికి తాజా మచ్చుతునక.

ఆదిలోనే తప్పటడుగు...
కాంగ్రెస్‌ అధ్యక్ష అభ్యర్థిగా రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ను ఎంచుకోవడం వెనక ఉన్న అజెండాను సరైన రీతిలో స్పష్టీకరించడంలోనే అధిష్టానం తప్పటడుగు వేసింది. దాంతో ఆదిలోనే హంసపాదులా నామినేషన్లకు ముందే ఎడారిలో తుపానును తలపిస్తూ పరిస్థితి చేయిదాటిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజస్తాన్‌ రాజకీయాల్లో చాపకింద నీరులా ఉన్న అసంతృప్తి జ్వాలను చల్లార్చేందుకు అధిష్ఠానం చేసిన ప్రయత్నం వికటించింది. అనుభవజ్ఞుడైన గెహ్లాట్‌కు జాతీయ అధ్యక్ష పదవి ఆశచూపి యువ సచిన్‌ పైలట్‌ను సీఎంగా చేయాలన్నది పార్టీ పెద్దల యోచన. అప్పుడు ఇద్దరికీ సమ న్యాయం చేసినట్టవుతుందని అధిష్టానం భావించింది. కానీ ఇదే విషయాన్ని గెహ్లాట్‌కు స్పష్టంగా చెప్పే విషయంలో అధిష్టానంతో పాటు అగ్ర నాయకులు మీనమేషాలు లెక్కపెట్టి అనవసర ఊహాపోహలకు తావిచ్చారు. రాజస్తాన్‌ను వదలడం సుతరామూ ఇష్టంలేని గెహ్లాట్‌కు ఇది రుచించలేదు. తప్పదంటే తన సన్నిహితునికే సీఎం పదవి కట్టబెట్టాలన్నది ఆయన ఆలోచన. దాంతో గెహ్లాట్‌ బల ప్రదర్శనకు దిగారు!

అస్పష్టత... అయోమయం
రాజస్తాన్‌ రాజకీయ యవనికపై ఆదివారం జరిగిన హైడ్రామా అటు అధిష్టానాన్నీ, ఇటు గెహ్లాట్‌నూ ఇరుకున పెట్టింది. రాజీనామాల వరద ఇద్దరినీ పీకల్లోతు ముంచేసింది. హైకమాండ్‌ హైకమాండే గనుక ఏం చేసినా చెల్లుతుంది. గెహ్లాట్‌ పరిస్థితే ఎటుకాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతోంది. అధ్యక్ష పదవిని హుందాగా అంగీకరించి, అనుచరులను సముదాయించి అధిష్టానం మాట జవదాటకుండా ఒప్పించగలిగితే తప్ప గెహ్లాట్‌ ఇప్పుడు రాజకీయ కుర్చీలాటలో ఏ కుర్చీ దొరక్క కిందపడిపోవాల్సి వస్తుందనేది నిపుణుల అంచనా. గెహ్లాట్‌ను కేవలం మధ్యేమార్గంగా అధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకున్నారే తప్ప నిజానికి కాంగ్రెస్‌లో సీనియర్లకు, అనుభవజ్ఞులకు కొదవలేదు. చిదంబరం, దిగ్విజయ్‌ సింగ్, కమల్‌నాథ్‌ నుంచి సుశీల్‌ కుమార్‌ షిండే దాకా చాలామంది ఉన్నారు. అధిష్టానం చెబితే బరిలోకి దిగడానికి వీరంతా సిద్ధంగానే ఉన్నారు.

వరుస తప్పిదాలు...
కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి బహుముఖ పోరు అనివార్యమైన పక్షంలో గాంధీల ఆశీస్సులు లేకుండా గెలవడం అసాధ్యమని అందరికీ తెలుసు. అంతేగాక అధిష్టానం చల్లని చూపు ఎవరిపై ఉంటే వారివైపే రాజస్తాన్‌ ఎమ్మెల్యేలు ఉండటమూ తప్పనిసరే. ఈ నేపథ్యంలో గెహ్లాట్‌ గనక అధిష్టానం అసంతృప్తికి లోనయితే సీఎం పదవికి దూరం కావాల్సి వస్తుంది. దాదాపు ఐదు దశాబ్దాల కింద కాంగ్రెస్‌తో జతకట్టిన గెహ్లాట్‌ తన రాజకీయ జీవితంలో ఏనాడూ హైకమాండ్‌ను ధిక్కరించలేదు. పార్టీ కష్టకాలంలోనూ విధేయతను స్పష్టంగా చాటుకున్నారు. కాంగ్రెస్‌ రాజకీయంగా 2014 నుంచి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తున్నప్పటికీ సీనియర్లకు, విధేయులకు సమున్నత రీతిలో అన్ని అవకాశాలు కల్పించింది.

ఈ క్రమంలో కొందరు సీనియర్లను, విధేయులను కోల్పోయింది కూడా! కానీ పంజాబ్‌లో దెబ్బతిన్న తర్వాత కూడా అధిష్టానం తీరు మార్చుకోకపోవడం దాని కార్యనిర్వహణ సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేసే పరిణామమే. రాజస్తాన్‌ రాజకీయ పరిస్థితిని అనవసరంగా చేయి దాటనిచ్చి, ఇప్పుడు దిద్దుబాటుకు దిగడమే ఇందుకు తార్కాణం. ఈ ఎపిసోడ్‌లో తప్పంతా 10–జన్‌పథ్‌దేనన్నది కొందరి వాదన. సీనియర్‌ నాయకుల్లో జవాబుదారీతనం లేకపోవడం పెద్ద మైనస్‌పాయింటని మరికొందరి వాదన. రాజస్తాన్‌ విషయంలోనైతే ఇది మరీ కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది.

ఆదివారం పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాకు ముందు అందరినీ సీఎల్పీ సమావేశానికి తీసుకొచ్చేలా గెహ్లాట్‌కు నచ్చజెప్పడంలో ఖర్గే, మాకెన్‌ విఫలమయ్యారు. భేటీకి పీసీసీ చీఫ్‌ గోవింద్‌సింగ్‌ గైర్హాజరయ్యారు. ఇంత గందరగోళం మధ్య ముఖ్యమంత్రిని, పీసీసీ చీఫ్‌ను దారిలోకి తెచ్చేందుకు క్రమశిక్షణ మార్గదర్శకాలు జారీ చేయడంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ వైఫల్యం ఆశ్చర్యకరం. రాజీనామాలు జరిగిన ఆదివారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఆయన గనక పరిస్థితిని చాకచక్యంగా చక్కబెట్టి ఉంటే విషయం ఇంతదాకా వచ్చేది కాదు. ఎమ్మెల్యేలకు వారి ఇష్టాయిష్టాలను వెల్లడించే స్వేచ్ఛ ఎప్పుడైనా ఉంటుంది. కానీ వారిని సముదాయించే పాత్రను నిర్వర్తించడంలో సీనియర్ల వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. పైగా, ఇంత జరిగినా అధిష్టానం మనోగతం మేరకు ఎమ్మెల్యేలను ఏకతాటిపై నడిపించడంలో విఫలమైన గెహ్లాట్‌కు గానీ, పీసీసీ చీఫ్‌కు గానీ కనీసం షోకాజ్‌ నోటీసు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

ఎలా ముగుస్తుందో...!
రాజస్తాన్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే పైలట్‌ను రాజస్తాన్‌ సీఎంగా చూడాలన్నది అధిష్టానం ప్రధానోద్దేశం. ఒకరకంగా ఇది గతంలో చేసిన తప్పును చాలా ఆలస్యంగా సరిద్దుకునే ప్రయత్నమే. పైలట్‌ 2014 నుంచి నాలుగేళ్లు పీసీసీ చీఫ్‌గా పార్టీని సజావుగా నడిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. దాంతో ఆయన్నే సీఎం చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆ సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గెహ్లాట్‌కు సీఎం పదవి దక్కింది. అంటే తెర వెనక ఎంత లాబీయింగ్‌ జరిగిందో ఊహించుకోవచ్చు.

రెండు ముక్కల్లో చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే పైలట్‌ నేరుగా రాహుల్‌ నివాసానికి వెళ్లి కలిస్తే గెహ్లాట్‌ అదే సమయంలో అహ్మద్‌ పటేల్‌ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. అలా మొదలైన లాబీయింగ్‌ తారస్థాయికి చేరింది. చివరికి అహ్మద్‌ పటేల్‌ మాటే చెల్లింది. గెహ్లాట్‌ సీఎం అయ్యారు. పైలట్‌ వంటి యువకున్ని సీఎం చేయాలని భావించిన రాహుల్‌ ఆ తర్వాత గెహ్లాట్‌ వైపు మొగ్గడంగమనార్హం. సోనియా, ప్రియాంక ఒత్తిడి మేరకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పైలట్‌ అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఆ తప్పిదాన్ని ఇప్పుడు దిద్దుకునేందుకు అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పైగా గెహ్లాట్‌ సారథ్యంలో వెళ్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్డం కష్టమని సర్వేల్లోనూ తేలింది. దాంతో పైలట్‌కే రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement