జైపూర్: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అశోక్ గెహ్లాట్ తన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి రావటంపై రాజస్థాన్‌లో తీవ్ర సంక్షోభానికి దారి తీసిన సంగతి తెలిసింది. గెహ్లాట్ సీఎంగా ఉండాలని ఆయన మద్దతుదారులు 80 మందికిపైగా తమ రాజీనామాను స్పీకర్ సీపీ జోషికి అందించారు. రాజీనామాలు అందించేందుకు ముందు ఎమ్మెల్యేలు సమావేశమైన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు గెహ్లాట్ మద్దతు ఎమ్మెల్యేలు. ఈ వీడియోలో.. కాంగ్రెస్ హైకమాండ్‌ను ధరివాల్ హెచ్చరిస్తున్నట్లు వినబడుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్‌ను తొలగిస్తే.. పార్టీకి తీరని నష్టం జరుగుతుందని, పంజాబ్‌లో మాదిరిగా ఘోర ఓటమి తప్పదని పేర్కొన్నారు.
‘అశోక్ గెహ్లాట్ ప్రస్తుతం ఎలాంటి రెండు పదవులు అనుభవిస్తున్నారని హైకమాండ్‌లోని ఎవరైనా చెప్పగలరా? ప్రస్తుతం సీఎం పోస్ట్‌ను వదులుకోవాలని ఎందుకు అడుగుతున్నారు? ఆయన రెండో పదవి పొందినప్పుడు దాని గురించి మాట్లాడతాం. ఇలాంటి కుట్ర కారణంగానే పంజాబ్‌ను కోల్పోయాం. ఇప్పుడు రాజస్థాన్‌ను కోల్పోయే అంచున ఉన్నాం. ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్‌ను తొలగిస్తే ఓటమి తథ్యం.’ అని పేర్కొన్నారు ధరివాల్.
సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు 80 మంది స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను ఆదివారం అందించారు. గెహ్లాట్ స్థానంలో సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిని చేయాలని హైకమాండ్ భావిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఆందోళన చెందారు. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని రాహుల్ గాంధీ ఇటీవలే స్పష్టం చేసిన క్రమంలో అధ్యక్ష పదవి కోసం గెహ్లాట్ సీఎం పదవిని వదులుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: గెహ్లాట్‌ను రేసు నుంచి తప్పించాలంటూ ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment