జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ సజావుగా సాగింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అసమ్మతి నాయకుడు సచిన్ పైలెట్ వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గానికి రూపకల్పన జరిగింది. మొత్తంగా 15 మంది కొత్త మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో 11 మంది కేబినెట్ హోదా కలిగిన వారు కాగా, నలుగురు సహాయమంత్రులు ఉన్నారు.
రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు. కొత్త మంత్రివర్గంలో సచిన్ వర్గానికి చెందిన అయిదుగురికి చోటు లభించింది. గత ఏడాది ముఖ్యమంత్రి గహ్లోత్‌పై సచిన్ పైలెట్ తిరుగుబాట బావుటా ఎగురవేసిన సమయంలో ఆయన వెంట ఉంటూ వేటుని ఎదుర్కొన్న విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాలను తిరిగి కేబినెట్‌లోకి తీసుకున్నారు.
పైలెట్ వర్గ ఎమ్మెల్యేలైన హేమరామ్ చౌధరి, బ్రిజేంద్రసింగ్ ఒలా, మురారిలాల్ మీనాలకు సహాయ మంత్రులు పదవులు దక్కాయి.కొత్త కేబినెట్‌పై సచిన్ సంతృప్తి వ్యక్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శుభసందేశాన్ని అందిస్తుందన్నారు.రాజస్థాన్ కాంగ్రెస్ ఐక్యంగా ముందుకు వెళుతుందని, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని చెప్పారు. ప్రమాణ స్వీకారనంతరం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు కల్పించామన్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా సచిన్?
ఉప ముఖ్యమంత్రి , పీసీసీ అధ్యక్ష పదవుల్ని పోగొట్టుకున్న అసమ్మతి నాయకుడు సచిన్ పైలెట్ పాత్ర కాంగ్రెస్‌లో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు అందరిలోనూ ఇదే ఆసక్తి రేపుతోంది. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సచిన్ పైలెట్ సమావేశమైనప్పుడు పార్టీలో తన స్థానంపై చర్చించారని, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని సోనియా హామీ ఇచ్చినట్టుగా పైలెట్ శిబిరం ప్రచారం చేస్తోంది. అప్పటివరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏదైనా రాష్ట్రానికి ఇన్‌చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
మరో రాష్ట్రానికి ఇన్‌చార్జ్‌గా వెళ్లినప్పటికీ రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సచిన్ కీలకంగా వ్యవహరించనున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్ రాష్టానికే ఇన్‌చార్జ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రియాంకగాంధీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉండాలని సచిన్‌కి ఇప్పటికే అధిష్టానం సంకేతాలు పంపినట్టుగా సమాచారం. ఇక ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్ర్‌రాల్లోనూ సచిన్ స్టార్ క్యాంపైనర్‌గా కూడా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment