జైపూర్ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికవడం దేశానికి అవసరమని రాజస్ధాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ వ్యాఖ్యానించి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. రానున్న సార్వత్రి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని ఆకాంక్షించిన కళ్యాణ్ సింగ్ మనమంతా బీజేపీ కార్యకర్తలమేనన్నారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి గవర్నర్ తటస్థ వైఖరి తీసుకోవాలి. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా తటస్ధంగా ఉండాల్సిన గవర్నర్ బీజేపీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాగా గవర్నర్ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమంటున్నాయి.
యూపీలోని అలీగఢ్‌లో రాజస్ధాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మనమంతా బీజేపీ కార్యకర్తలమని, తిరిగి బీజేపీ విజయం సాధించాలని మనం కోరుకుంటున్నామని గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాగా 1992లో బాబ్రీమసీదు విధ్వంసం జరిగిన సమయంలో కళ్యాణ్ సింగ్ యూపీ సీఎంగా ఉన్నారు. 87 సంవత్సరాల కళ్యాణ్ సింగ్ ఆ తర్వాత కొన్నేళ్లకు పార్టీని వీడారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం ఆయనను రాజస్ధాన్ గవర్నర్‌గా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment