![Election Commission Revoked Kamal Nath Star Campaigner Status - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/30/kamal%20nath.jpg.webp?itok=5SPgZT-w)
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కమల్ నాథ్‌కు ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగాను కమల్ నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక మహిళా అభ్యర్థిని ‘ఐటెం’ అంటూ సంభోదించడం పట్ల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళ పట్ల ఇలాంటి పదాలను వాడటం కమిషన్ జారీ చేసిన నియమాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది. రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ, కమల్ నాథ్ ప్రవర్తనా నియమావళి నిబంధనలను పదేపదే ఉల్లంఘించారని తెలిపింది. (చదవండి: ‘ఐటెం’ వ్యాఖ్యలపై కమల్ నాథ్ వివరణ)
అలానే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కూడా కమల్ నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక ఇప్పటి నుంచి కమల్ నాథ్ ఏదైనా నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటే.. మొత్తం వ్యయాన్ని ఆ నియోజకవర్గ అభ్యర్థినే భరించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ తన ఉత్తర్వలో స్పష్టం చేసింది. అలానే ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు హుందాగా, గౌరవప్రదంగా మెలగడం కోసం అందరి ఏకాభిప్రాయంతో ప్రవర్తనా నియమావళిని రూపొందించారని.. ఇది అనేక దశాబ్దాలుగా అమలులో ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది.
Comments
Please login to add a commentAdd a comment