సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ సినీనటుడు చిరంజీవిపై 2014లో గుంటూరు, అరండల్‌పేట పోలీసులు నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు బుధవారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ బుధవారం ఉత్తర్వులిచ్చారు. 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ రాత్రి 10 గంటల తరువాత కూడా ప్రచారం నిర్వహించారంటూ చిరంజీవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను కింది కోర్టు విచారణకు పరిగణనలోకి తీసుకుంది.
ఈ కేసును కొట్టేయాలని కోరుతూ చిరంజీవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిరంజీవిపై అక్రమంగా కేసు నమోదు చేశారని అతని తరఫు సీనియర్ న్యాయవాది పి.గంగయ్యనాయుడు కోర్టుకు నివేదించారు. ప్రచారం పూర్తి చేసి తిరిగి వస్తున్నప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, పోలీసులు చిరంజీవిపై నమోదు చేసిన కేసును కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment