తాను పదవినుంచి దిగిపోతాననే భావన ఏపీ సీఎం చంద్రబాబులో రోజు రోజుకు బలపడుతున్న తీరు ఆయనను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్టుంది. ఫలితంగా తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోయే వాతావరణం ఉందని ఎన్నికల ప్రకటనకు చాలా ముందే పాలకపక్ష పెద్ద గ్రహించారు. అధిగమించే ఎత్తుగడలు ప్రారంభించారు. ఇష్టులైన అధికారులను తెచ్చుకోవడం, ఈసీపై దాడులకు ముందే సిద్ధం కావడం, ప్రభుత్వ డబ్బును ఎన్నికల తరుణంలో పంచేయడం.. ఇవేవీ పనిచేయకపోవడంతో చంద్రబాబు విలవిల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో బట్టబయలవుతున్న అన్ని అరిష్టాలకూ మలివిడత ఎన్నికల సంస్కరణలే పరిష్కారమా?
‘ఆరిపోయే దీపానికి వెలుగులెక్కువ, ఆపద్దర్మ ముఖ్యమంత్రికి అరుపులెక్కువ’ఇదొక కొత్త పేరడీ! సామాజిక మాధ్యమాల విస్తృతి, ప్రభావం వల్ల వ్యక్తుల సృజన, వ్యక్తీకరణ సామర్థ్యాలూ పెరిగాయి. అందుకు కొత్తగా పుట్టుకొచ్చే ఇటువంటి పేరడీ సామెతలే నిదర్శనం. ఇది వినగానే చాలామందికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడే గుర్తుకు వస్తారు. ఎందుకంటే, పలు విషయాల్లో ఆయ నిప్పుడు పెద్ద గొంతుతో అరుస్తున్నారు. కానీ, ఆయన ఆపద్దర్మ ముఖ్య మంత్రి కాదు. పూర్తిస్థాయి ముఖ్యమంత్రే! కాకపోతే, ఎన్నికల కోడ్ ఆమల్లో ఉన్నప్పటికీ, నిబంధనల ప్రకారం చేయకూడని పనులన్నీ చేసే స్తున్నారు. వాటిని యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పైగా నెపాన్ని ఎన్నికల సంఘం (ఈసీ)పై నెడుతున్నారు. తాను దిగిపోయే ముఖ్యమంత్రినని ఇతరుల కన్నా ఈయనే ఎక్కువగా నమ్ముతున్నారు.
అందుకే, ‘జూన్ 8 వరకు నేనే ముఖ్యమంత్రిన’ని ఒకమారు, ‘..రేపు ఫలితాలొచ్చాక కూడా జగన్‌మోహన్‌రెడ్డి లోటస్‌పాండ్ నుంచే పాలన సాగిస్తారా?’ అని మరో మారు... ఇలా మాట్లాడటం అంటే, తెలియకుండానే తన మనోభావాల్ని వెల్లడించడమే! తన ఓటమిని అంగీకరించడమే! దిగిపోతాననే భావన లోలోపల రోజురోజుకు బలపడుతున్న తీరు ఆయనను తీవ్ర ఆందో ళనకు, గగుర్పాటుకు గురిచేస్తున్నట్టుంది. ఫలితంగా తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఆయనేదో చాణక్యం చేస్తారని కొద్దో గొప్పో విశ్వాసమున్న వారి నమ్మకమూ క్రమంగా సడలిపోతోంది. ‘ఏమిటీ! ఈయన ఇలా తయారయ్యారు..?’ అని వారు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇక ఆయనలో నైపుణ్యాల కన్నా వ్యవహార దక్షత ఎక్కువని భావించే వారు మాత్రం, ‘ఇప్పుడేమిటి? ఆయనెప్పుడూ అంతే!’ అని పెదవి విరు స్తున్నారు. వారి వాదనకు, తన తాజా చర్యల ద్వారా చంద్రబాబు మరింత బలం చేకూరుస్తున్నారు. ఎవరి వాదనెలా ఉన్నా.. ఈ ఎన్నికల ప్రకటనకు ముందు, తర్వాత జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్య వాదులకు జుగుప్స కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో జరుగుతున్న దారుణాలకు అంతే లేదు. చాలా నిబంధనలు కాగితాలకే పరిమిత మౌతున్నాయి. ఎటు చూసినా ఉల్లంఘనలే! ఉన్న నిబంధనల పటిష్ట అమలుతోపాటు మరో విడత ఎన్నికల సంస్కరణల అవసరం కొట్టొ చ్చినట్టు కనిపిస్తోంది. వీటిని మరో దశకు తీసుకువెళ్లాల్సి ఉంది. మలి విడత ఎన్నికల సంస్కరణ ప్రతిపాదనలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతిపాదనల్ని ఓ సమగ్ర ఎజెండా రూపంలో 2004 జూలైలో నే నాటి ఎన్నికల సంఘం ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది.
పోలింగ్‌కు ముందే ఓటమి జాడ పసిగట్టారు
ఇప్పుడు సీఎం చంద్రబాబు చేస్తున్న అల్లరంతా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల పైన, ఈసీపైన. ఓడిపోయే వాతావరణం ఉందని ఎన్నికల ప్రకటనకు చాలా ముందే పాలకపక్ష పెద్ద గ్రహించారు. అధిగమించే ఎత్తుగడలు ప్రారంభించారు. సంక్షేమ పథకాలకు మెరుగులు దిద్దడమైనా, వాటి నీడలో నగదు బదిలీ అయినా, అందుకు సరిపడేలా శాఖాపరమైన ఆర్థిక సర్దుబాట్లయినా... వ్యూహాత్మకంగా చేసు కున్నవే. ఎన్నికల ప్రకటనకు కొద్ది కాలం ముందే, తమ అభీష్టం ప్రకారం జిల్లాల కలెక్టర్లను నియమించుకున్నారు. మూడు సంవత్సరాలకు పైబడి ఒకే చోట ఉన్న కొందరిని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చారే తప్ప ఎన్నికల విధులకు దూరం చేయలేదు. 175 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులనూ, ‘చెబితే వింటార’నే అనుకూలురినే నియ మించు కున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదింపుల మేరకే జాబి తా రూపొందింది. మరో వైపు సాంకేతిక పూర్వ రంగాన్నీ సిద్ధ్దం చేసు కున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమని, చేసి చూపిస్తామని దేశ మంతా ప్రచారం చేసిన వేమూరి హరిప్రసాద్ చౌదరి అనే నిపుణుడి సేవ ల్ని చాలా ముందుగానే ఖరారు చేసుకున్నారు. అంటే, ‘దొంగకు తాళా లిచ్చార’నే సామెత చందంగా ఆయనకు ప్రభుత్వ ఐటీ సలహాదారుగా స్థానం కల్పించారు. కలెక్టర్ల సమావేశంలోనూ కూర్చోబెట్టుకున్నారు. సీఎం సొంత జిల్లా కలెక్టరుతో ఆయన నేరుగా సంభాషించడం, ఈవీఎం పనితీరుపై ఫిర్యాదు, కలెక్టరు వివరణ, ‘ఈసీ’ ప్రస్తా్తవనే లేకుండా... కావాలంటే ఈవీఎం మారుస్తాననడం ఇదే ధృవపరుస్తోంది. ఇక్కడే ఏదో వ్యూహం జరిగింది. తమ లోపాయికారి వ్యవహారాల్ని నిఘా విభాగం ఉన్నతాధికారి కనుసన్నల్లో గోప్యంగా జరిపించుకోవచ్చని మరో పక్క పథకం వేశారు.
కానీ, పరిస్థితులు వికటించి ఎన్నికల సంఘం కొన్ని బదిలీలు జరిపేసరికి ఉక్రోషం తారాస్థాయికి చేరింది. కోడ్ అమల్లోకి వచ్చిననాటి నుంచి పాలనా వ్యవస్థ మొత్తం ఈసీ ప్రత్యక్ష అజమాయిషీలోకి వస్తుందని అందరికీ తెలుసు. అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈసీ ఆదేశాలు బేఖాతరంటూ, సీఎం చెప్పినట్టే నడు చుకున్నారు. ఈసీ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేశారు. ఇంత జరిగినా ఆయన్ని బదిలీ చేయొద్దన్నది బాబు వాదన. ఏ బదిలీలూ చేయొద్దం టారాయన. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల్ని రాష్ట్రంలోని ముఖ్య ఎన్నికల అధికారి అమలు చేయొద్దంటూ ఆయన్నే గదమాయించారు. నా సంగతి చూపిస్తానని టీవీ కెమెరాల ముందే బెదిరించారు.
మీ వ్యూహం వికటిస్తే... ఈసీపై ధుమధుమలా?
ఎన్నికల అధికారుల నియామకాల నుంచి కింది స్థాయి సిబ్బందిని సమ కూర్చడం వరకు ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏ పోలింగ్ కేంద్రానికి ఏ ఈవీఎం వెళ్లాలన్నదీ ప్రణాళిక రూపొందించినట్టు సమా చారం! వందల సంఖ్యలో ప్రభుత్వ అధికారుల్ని రిజర్వులో పెట్టి, ఆశా వర్కర్లతో, ప్రయివేటు విద్యాసంస్థల సిబ్బందితో ఎన్నికల పనులు చేయి ంచాలని ఎవరు నిర్ణయించారు? బెంగళూరు నుంచి వచ్చిన వందల మంది సాంకేతిక సిబ్బంది సహకారాన్ని, ఈవీఎంలు మొరాయించిన చోట ఎందుకు తీసుకోలేదు? ఇవన్నీ ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల పైచిలుకు ఈవీఎంలు(మొత్తం 92 వేలకు గాను) మొరాయిస్తే, మూడో వంతు పనిచేయలేదనే ప్రచారం ప్రారంభించారు. అనుకూల మీడియా దానికి ‘తందానా’ అంది. తానూ, ఈ తందానా బ్యాచ్ కలిసి పోలింగ్ శాతాల్ని రమారమి తగ్గించేందుకు విశ్వయత్నం చేశారు. ఇంకోవైపు నోరుపెంచి, ఇదంతా ఈసీ వైఫల్యమన్నారు. నానా యాగీ చేశారు. ‘... షామియానాలు లేవు, మంచినీళ్లు లేవు, తెల్లవార్లూ పోలింగ్ జరిపారు...’ ఇలా నోటికొచ్చిన విమర్శలు చేశారు. ఎన్నికల సంఘానికి తమ కార్యాలయం బయట ఒక బంట్రోతు కూడా ఉండరు. మరెలా? తగు ఆదేశాలు, అజమాయిషీతో వారు పర్యవేక్షణ మాత్రమే చేస్తారు. వారి ఆదేశాల్ని అమలుపరుస్తూ, ఎన్నికల ప్రక్రియను నిర్వహించవలసింది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే! స్థూలంగా ఈసీ ఇచ్చే ఆదేశాల ప్రకారం ఈ యంత్రాంగమే పనులు నిర్వహించాలి.
స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం, ప్రక్రియ ప్రారంభంలోనే, తాను స్వచ్ఛందంగా తప్పుకొని రాష్ట్రపతి పాలన కోరిన పెద్దమనిషేం కాదు ఈ ముఖ్యమంత్రి! ‘జూన్ 8 వరకు నేనే ముఖ్యమంత్రిని’ అని ఇప్పటికీ బల్ల గుద్ది చెబుతున్నారు. వద్దంటే శాఖల వారీ సమీక్షలు జరుపుతున్నారు. పెద్ద మొత్తంలో పాత బిల్లులు ఆమోదిస్తున్నారు. మరి, ఎన్నికల నిర్వహణ వైఫల్యాన్ని ఎవరికి అంటగట్టాలని చూస్తున్నారు? ఈ వైఫల్యాలూ ముందస్తు పథకం ప్రకారమే జరిగాయా? అనుమానం సహజం. ఎందుకంటే, ప్రభుత్వ పెద్దలకు అధికారులపై పట్టున్న కొన్ని జిల్లాల్లోనే ఈ వైఫల్యాలు తలెత్తాయి.
‘ఈసీ వైఫల్యమని ఎత్తిచూపే ఎజెండా నేను భుజానికెత్తుకున్నాను, కనుక, మీరెవరూ ఈసీకి సహకరించకండి’ అని మాటవినే యంత్రాంగానికి ముందే ప్రభుత్వ పెద్ద ‘సైగ’ చేశారేమో? మూడు వందల పై చిలుకు ఈవీఎంలు మొరాయిస్తే, అందులో మూడింట రెండొంతుల ఈవీఎంలు ఒకటి రెండు గంటల్లోనే సర్దుకున్నాయి. ఉదయం ఎక్కువ జాప్యం జరిగిన చోట సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగింది. అలా సాయంత్రం పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 131 బూత్‌లలో జరిగితే, మూడు జిల్లాల్లోనే (కృష్ణా–37, గుంటూరు–21, ప్రకాశం–25) 83 చోట్ల జరిగిందంటే అనుమానం రాదా? ఈసీ ఏర్పాటు చేసిన ‘ఈవీఎం చాలెంజ్’ సమయంలోనూ కిమ్మనని వారు, వ్యూహం బెడిసికొట్టినందుకే వాటిపై ‘ట్యాంపరింగ్’ అల్లరి పెంచినట్టు స్పష్టమౌతోంది.
ఈసీ కోరలు ఇంకా పదునెక్కాలి
స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే నిబంధనల్ని ఉల్లంఘించినా చర్యలు లేని పరిస్థితి నెలకొంది. పది రూపాయలు ఖర్చు పెడదామంటే ఐటీ దాడులు చేపిస్తున్నారు... అందుకే నేనొక ప్లాన్ చేశా, ప్రభుత్వ పథ కాల డబ్బులే ఇటు మళ్లించి మీకందేలా చేస్తున్నాను, మొన్న ఆ పథకం కింద అంతిచ్చాను, ఇంకో పథకం కింది ఇంత ఇప్పించాను. రేపు మరో పథకం కింద మరింత రాబోతోంది. శుబ్బరంగా ఖర్చు పెట్టేస్తున్నాను, అందుకే, తమ్ముళ్లూ నాకే ఓటేయండి... ఇదీ వరస! ఇది ఓటర్లను ప్రలో భ పెట్టడం కాదా? అదీ సొంత డబ్బుతో కాదు, పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో! ప్రజాధనాన్ని విచ్ఛల విడిగా ఓట్లు దండుకునేందుకు వెచ్చి స్తున్నానని ఒక పాలకుడు ఇంత పచ్చిగా అంగీకరించడం బహుశా... ఆఫ్రికా, ల్యాటిన్ అమెరికా దేశాల్లోనూ ఉండదేమో! వీటన్నిటికీ విరు గుడు మలి విడత ఎన్నికల సంస్కరణలే! ఎన్నికల్లో పాలకపక్షాల అధి కార దుర్వినియోగాల్ని అడ్డుకోవాలి.
ఎన్నికల ప్రకటనతోనే దేశంలో, రాష్ట్రాల్లో అప్పటివరకున్న ప్రభుత్వాలు తప్పించి రాష్ట్రపతి పాలన తేవాలి. పాలక–విపక్షాల మధ్య క్షేత్ర సమస్థితి నెలకొల్పాలి. విచ్చలవిడి డబ్బు వ్యయం, మద్యం ఖర్చును ఇంకేవైనా పటిష్ట చర్యల ద్వారా అరి కట్టాలి. ప్రజాప్రాతినిధ్య చట్టాన్నీ సవరించాలి. ‘నియోజకవర్గ అభివృద్ధి్ద’ సాకుతో పార్టీలు మారి, ‘అధికారం’ చంకన చేరే ప్రజాప్రతినిధుల సభ్య త్వాలు రద్దయ్యే సంస్కరణలు రావాలి. పార్టీ మార్పిళ్ల నియంత్రణ చట్టాన్ని సవరించాలి. ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర పతి–గవర్నర్లకో, ఎన్నికల సంఘానికో అప్పగించాలి. అంతే తప్ప, స్పీకర్ పదవి ప్రతిష్టను మంటగలిపే ఫక్తు రాజకీయ తాబేదారుల చేతుల్లో పెట్టొద్దు. గత ఎన్నికల్లో గెలవడానికి 11 కోట్లు ఖర్చుపెట్టానని బహిరంగంగా ప్రకటించినా చర్యలు లేకుంటే, వారు తర్వాతి ఎన్నికల్లో బూత్ రిగ్గింగులకైనా తలపడతారన్నదే ఈ ఎన్నికలు నేర్పిన పాఠం. పాఠం నేరిస్తేనే ప్రజాస్వామ్యానికి రక్ష!
-దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment