సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దుర్విని యోగంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలను, నేరపూరిత సమాచారాన్ని కట్టడి చేసేందుకు సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు చేపట్టాల్సిన చర్యలను నిర్ధారిస్తూ కఠిన నిబంధనావళిని విడుదల చేసింది. అలాగే, తమ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రసారమయ్యే కంటెంట్‌కు సంబంధించి యూట్యూబ్, ఆమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సంస్థలు అనుసరించాల్సిన నియమాలను నిర్ధారించింది. వివాదాస్పద సమాచారంపై సత్వరమే స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారం కోసం అధికారులను నియమించి, వారు భారత్‌లోనే నివసించేలా చూడాలని ఆదేశించింది. భారత్‌లోని చిరునామాతో కార్యాలయం ఉండాలని పేర్కొంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా షేర్ అవుతున్న పోస్ట్‌లను, సంబంధిత ఖాతాలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాల విషయంలో కేంద్రానికి, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు మధ్య ఇటీవల వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా, ఓటీటీ, డిజిటల్ మీడియాల నియంత్రణకు ఉద్దేశించిన తాజా నియమ, నిబంధనలను ‘ద ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్’ పేరుతో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం వెల్లడించారు. దర్యాప్తు సంస్థలతో సమన్వయం కోసం వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్ తదితర సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ఆమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యాజమాన్యాలు భారత్‌లో ప్రత్యేకంగా ప్రతినిధులను నియమించుకోవాలని ఆ నిబంధనల్లో స్పష్టం చేశారు. అలాగే, వివాదాస్పద సమాచారాన్ని మొదట రూపొందించిన వ్యక్తిని 24 గంటల్లోపు గుర్తించి, ఆ సమాచారాన్ని, ఆ ఖాతాను తొలగించాలని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే సమాచారం, లైంగిక దృశ్యాలు, మార్ఫ్‌డ్ ఫొటోలు, నగ్నచిత్రాల విషయంలోనూ ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు స్పందించాలని ఆదేశించారు. వివాదాస్పద సమాచారంపై ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే.. తక్షణమే స్పందించాలని స్పష్టం చేశారు.
వినియోగదారులు, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం భారత్‌లోనే ఉండేలా ఒక అధికారిని నియమించాలని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యల వివరాలతో నెలవారీ నివేదికను రూపొందించాలని, వినియోగదారుల ఫిర్యాదులపై 15 రోజుల్లోగా స్పందించాలని ఆదేశించారు. దేశ సార్వభౌమత్వాన్ని, దేశ రక్షణను, సమాజంలో శాంతి భద్రతలను దెబ్బతీసే సమాచారంపై.. ఆ సమాచారాన్ని తొలుత రూపొందించిన వ్యక్తి వివరాలను ప్రభుత్వం కానీ, కోర్టులు కానీ కోరితే వెంటనే అందించాలని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏదైనా సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. వినియోగదారుల సంఖ్య ఆధారంగా సోషల్ మీడియా సంస్థలను రెండు విభాగాలుగా విభజిస్తూ నిబంధనలను రూపొందించారు.
ప్రభావశీల సామాజిక మాధ్యమాలు మరింత జవాబుదారీతనంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. వార్తలు, వార్తాకథనాలను అందించే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కూడా వాటి యాజమాన్య వివరాలను స్పష్టంగా పేర్కొనాలని నిబంధనల్లో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలు, ఓటీటీ సంస్థలు, డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్స్ దుర్వినియోగం కాకుండా చూసేందుకే ఈ నిబంధనలను రూపొందించామని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఆయా సంస్థలు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 2011 నాటి నిబంధనల స్థానంలో తాజా నిబంధనలను తీసుకువచ్చామన్నారు. ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థలు తాజా నిబంధనలను అమలు చేసేందుకు మూడు నెలల గడవును ఇచ్చామన్నారు. ‘భారత్‌లో అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థల వ్యాపార విస్తరణను స్వాగతిస్తాం. విమర్శను, భిన్నాభిప్రాయాన్ని కూడా గౌరవిస్తాం. అలాగే, సోషల్ మీడియా వినియోగదారులకు తమ ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక సరైన వేదిక కూడా ఉండాలి’ అని ఆయన వివరించారు.
స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ డేటా చవకగా లభిస్తున్న భారత్.. సోషల్ మీడియా సంస్థలకు అతిపెద్ద లాభదాయక మార్కెట్‌గా మారిన విషయం తెలిసిందే. భారత్‌లో వాట్సాప్‌కు 53 కోట్ల మంది, ఫేస్‌బుక్‌కు 41 కోట్లమంది, యూట్యూబ్‌కు 44.8 కోట్ల మంది, ట్విటర్‌కు 1.75 కోట్లమంది, ఇన్‌స్ట్రాగామ్‌కు 21 కోట్లమంది వినియోగదారులు ఉన్నారు. సోషల్ మీడియా నిబంధనలను ఐటీ శాఖ పర్యవేక్షిస్తుంది. ఓటీటీ, డిజిటల్ మీడియా నిబంధనలను సమాచార ప్రసార శాఖ పర్యవేక్షిస్తుంది. అన్ని సోషల్ మీడియా సంస్థలు భారతీయ చట్టాలను గౌరవించాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల వినియోగదారుల సాధికారత లక్ష్యంగా కొత్త నిబంధనలు రూపొందాయని ట్వీట్ చేశారు.
తాజా నిబంధనల ప్రకారం.. అన్ని సామాజిక మాధ్యమాల యాజమాన్యాలు ఒక చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, ఒక నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్, ఒక రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించుకోవాలి. వారు భారత్‌లోనే నివాసం ఉండాలి. ఫిర్యాదులకు సంబంధించిన నివేదికను నెలవారీగా వారు రూపొందించాలి. తమ అకౌంట్లను స్వచ్చందంగా వెరిఫై చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించాలి. కంటెంట్‌ను తొలగించడానికి సంబంధించి వినియోగదారుడికి ముందుగా సమాచారం, వివరణ ఇవ్వాలి. ఈ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం వినియోగదారులకు ఉండాలి. వినియోగదారుల వయస్సు ఆధారంగా తాము ప్రసారం చేసే కంటెంట్‌ను యూనివర్సల్, యూ/ఏ 7+ సంవత్సరాలు, యూ/ఏ 13+ సంవత్సరాలు, యూ/ఏ 16+ సంవత్సరాలు, ఏ(పెద్దలకు మాత్రమే) అనే ఐదు విభాగాలుగా ఓటీటీ సంస్థలు విభజించాలి.
ఆయా విభాగాలను స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. దాంతో, వినియోగదారులు తాము వీక్షించనున్న వీడియోపై ముందే ఒక అవగాహనకు వస్తారు. యూ/ఏ 13+ సంవత్సరాలు.. ఆ పై విభాగాలకు సంబంధించి పిల్లలకు అందుబాటులో లేకుండా పేరెంటల్ లాక్ సదుపాయాన్ని కల్పించాలి. అడల్ట్ కంటెంట్‌ను వీక్షించేందుకు వయస్సును నిర్ధారించే విశ్వసనీయమైన ప్రక్రియ ఉండాలి. వార్తలను, వార్తాకథనాలను ప్రసారం చేసే డిజిటల్ మీడియా సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను, కేబుల్ టెలీవిజన్ నెట్‌వర్క్స్ రెగ్యులేషన్ చట్టంలోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అపోహలను, అసత్యాలను ప్రచారం చేయకూడదు. స్వీయ నియంత్రణతో కూడిన మూడంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తొలి స్థాయిలో పబ్లిషర్ల స్వీయ నియంత్రణ, రెండో స్థాయిలో పబ్లిషింగ్ సంస్థలకు సంబంధించిన ఉమ్మడి స్వీయ నియంత్రణ విభాగం, మూడో స్థాయిలో పర్యవేక్షక నియంత్రణ ఉండాలి. రెండో స్థాయిలోని స్వీయ నియంత్రణ విభాగం కోసం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, లేదా సంబంధిత వ్యవహారాల్లో నిపుణుడైన వ్యక్తిని నియమించుకోవచ్చు. ఆ కమిటీలో గరిష్టంగా ఆరుగురు సభ్యులుండాలి. సమాచార ప్రసార శాఖ వద్ద ఆ కమిటీని రిజిస్టర్ చెయ్యాలి.
- తమ అకౌంట్లను స్వచ్చందంగా వెరిఫై చేసుకునేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించాలి. కంటెంట్‌ను తొలగించడానికి సంబంధించి వినియోగదారుడికి ముందుగా సమాచారం, వివరణ ఇవ్వాలి. ఈ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం వినియోగదారులకు ఉండాలి.
- వినియోగదారుల వయస్సు ఆధారంగా తాము ప్రసారం చేసే కంటెంట్‌ను యూని వర్సల్, యూ/ఏ 7+ సంవత్సరాలు, యూ/ఏ 13+ సంవత్సరాలు, యూ/ఏ 16+ సంవత్సరాలు, ఏ(పెద్దలకు మాత్రమే) అనే 5 విభాగాలుగా ఓటీటీ సంస్థలు విభజించాలి. అవి స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. యూ/ఏ 13+ సంవత్సరాలు.. ఆ పై విభాగాలకు సంబంధించి పిల్లలకు అందుబాటులో లేకుండా పేరెంటల్ లాక్ సదుపాయాన్ని కల్పించాలి. అడల్ట్ కంటెంట్‌ను వీక్షించేందుకు వయస్సును నిర్ధారించే విశ్వసనీయమైన ప్రక్రియ ఉండాలి.
- వార్తలను, వార్తాకథనాలను ప్రసారం చేసే డిజిటల్ మీడియా సంస్థలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రెగ్యులేషన్ చట్టంలోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అపోహలను, అసత్యాలను ప్రచారం చేయకూడదు. స్వీయ నియంత్రణతో కూడిన మూడంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తొలి స్థాయిలో పబ్లిషర్ల స్వీయ నియంత్రణ, రెండో స్థాయిలో పబ్లిషింగ్ సంస్థలకు సంబంధించిన ఉమ్మడి స్వీయ నియంత్రణ విభాగం, మూడో స్థాయిలో పర్యవేక్షక నియంత్రణ ఉండాలి. రెండో స్థాయిలోని స్వీయ నియంత్రణ విభాగం కోసం రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, లేదా రిటైర్డ్ హైకోర్టు దాన్యాయమూర్తి, లేదా సంబంధిత వ్యవహారాల్లో నిపుణుడైన వ్యక్తిని నియమించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment