యథేచ్ఛగా టీడీపీ కోడ్‌ ఉల్లంఘన | TDP Violets Election Code Of Conduct In AP | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా టీడీపీ కోడ్‌ ఉల్లంఘన

Published Tue, Mar 12 2019 8:00 AM | Last Updated on Tue, Mar 12 2019 11:19 AM

TDP Violets Election Code Of Conduct In AP - Sakshi

సైబర్‌ నెట్‌ టీవీలో కొనసాగుతున్న చంద్రబాబు ప్రచారం

సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, నెట్‌వర్క్‌: సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన జరుగుతోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇంకా మొద్దు నిద్ర వీడడం లేదనే విమర్శలొస్తు న్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ఆదివారం నుంచి సార్వత్రిక ఎన్నికల కోడ్‌ వచ్చి చేరింది.  అయితే అధికారులు  ఇంకా అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. ప్రభుత్వ ప్రచార ప్రకటనల్లో సీఎం, మంత్రుల ఫొటోలు తొలగించాల్సి ఉన్నా తాత్సారం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇంకా సీఎం ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు దర్శనమి స్తున్నాయి. నిబంధనల మేరకు రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయాల్సి ఉంది. ఇతర పార్టీల నాయకుల విగ్రహాలకు ముసుగు వేస్తున్న అధికారులు..  ‘అధికార’ పార్టీ నేతల విగ్రహాలకు మినహాయింపు ఇస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి.

ప్రతిపక్ష పార్టీ ఫ్లెక్సీలు మాత్రమే తొలగింపు
సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీ నేతల ఫ్లెక్సీలను తొలగించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లను ఎమ్మెల్సీ కోడ్‌ వచ్చిన వెంటనే  తొలగించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మ గాంధీ, అంబేడ్కర్, రాష్ట్రపతి, గవర్నర్‌ ఫొటోలను మాత్రమే ఉంచి.. సీఎం, మంత్రి  తదితరుల ఫొటోలను తొలగించాలి. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో  ఇంకా ఫొటోలు దర్శనమిస్తుండడం గమనార్హం. అన్న క్యాంటీన్లలో మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్,  ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫొటోలను తొలగించే ధైర్యం అధికారులకు లేకపోయింది.
 
మంత్రి ఆనందబాబు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన  
నిబంధనల ప్రకారం సంక్షేమ పథకాలకు సంబంధించిన పనిముట్లను లబ్ధిదారులకు అందజేయకూడదు. అయితే మంత్రి నక్కా ఆనందబాబు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి గుంటూరు జిల్లా యడవూరు మండలంలోని పదిహేను గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆదివారం రాత్రే కుట్టు మిషన్లను  పంపిణీ చేయించారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరఫున మంత్రి నక్కా ఆనందబాబుకు ఓటెయ్యాలని హామీ తీసుకున్నారు.
 
రోడ్ల నిర్మాణం..
గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన జరుగుతూనే ఉంది. అధికార పార్టీ నాయకులు కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయడం తదితర కార్యక్రమాలు చేసేస్తున్నారు.ప్రభుత్వ పథకాలకు చెందిన హోర్డింగులు, స్టిక్కర్లు ఎప్పటిలాగే దర్శనమిస్తున్నాయి. 

శ్రీకాకుళం జిల్లాలో..
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి–గోవిందపురం గ్రామంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరుకు సంబంధించి ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీని అభినందిస్తూ  టీడీపీ నేతలు సోమవారం సభ ఏర్పాటు చేశారు. పలాస ఎమ్మెల్యే శివాజీ కుమార్తె గౌతు శిరీష, ఆయన అల్లుడు వెంకన్న చౌదరి దర్జాగా సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఎన్నికల సంఘానికి ఝలక్‌ ఇచ్చారు. కోటబొమ్మాళి మండలం కొత్తపేట కొండ పోరంబోకు స్థలంలో టీడీపీకి చెందిన కార్యకర్తలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా పాత తేదీలతో పొజిషన్‌ సర్టిఫికెట్లు జారీ చేశారని కొత్తపేట మాజీ సర్పంచి ఆర్‌.ముకుందరెడ్డి  టెక్కలి ఆర్‌డీవోకు ఫిర్యాదు చేశారు. వీరఘట్టం మండలంలో ‘బడికొస్తా’ పథకంలో భాగంగా 8, 9వ తరగతులు చదువుతున్న బాలికలకు గతంలో అందించాల్సిన సైకిళ్లను సోమవారం పంపిణీ చేశారు. 

చిత్తూరు జిల్లాలో ..
తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారపార్టీ నాయకుల సిఫార్సు లేఖలకు అధికార యంత్రాంగం దర్శనాలు కల్పిస్తోంది. తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్సులపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రచారాలకు సంబంధించిన చిత్రాలు తొలగించలేదు. ఇక ఫైబర్‌నెట్‌ కేంద్రాల వద్ద ముఖ్యమంత్రి చిత్ర పటాలతో ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇంకా తీయలేదు. తిరుచానూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా అన్న క్యాంటీన్‌ నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. 

మీకెందుకు సార్‌.. ‘పచ్చ’పాతం..
రాజమహేంద్రవరం నగరంలోని జాంపేట వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద  పార్టీ బ్యానర్లపై పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, దివంగతనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రాలు ఉన్నాయంటూ బ్యానర్లు తొలగించాలని హడావుడి చేసిన అధికారులు.. టీడీపీ కార్యాలయం వద్ద  స్వామి భక్తి ప్రదర్శించారు. అక్కడ సీఎం చంద్రబాబు, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫొటోలు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకపోవడంపై జనం మండిపడుతున్నారు. 


టీడీపీ కార్యాలయంపైన చంద్రబాబు, గోరంట్ల ఫొటోలున్నా పట్టించుకోని అధికారులు

ఏ అధికారీ పట్టించు‘కోడ్‌’..
కాకినాడ నగరంలోని జగన్నాథపురం వంతెన దిగువ భాగంలో ప్రభుత్వం బీసీ కులస్తులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా కాకినాడ నగరపాలక అధికార యంత్రాంగం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. 

కర్నూలు జిల్లాలో..
 ఆత్మకూరు పట్టణంలో టీడీపీ నాయకులు ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ పేదలను పిలిపించుకుని స్థానిక మైనార్టీ కాలనీలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ భరత్‌కుమార్‌ అక్కడికి వెళ్లేలోపు అందరూ జారుకున్నారు. వెల్దుర్తి మండలం రామళ్లకోటలో సీబీఎన్‌ ఆర్మీ పేరుతో వాహనాలు వినియోగించి ప్రచారం చేపట్టారు. కొలిమిగుండ్లలో చెత్తబుట్టలు పంపిణీ చేసి..పట్టపగలే కోడ్‌ ఉల్లంఘించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement