స్థానిక అభ్యర్థీ.. ఇవి తెలుసుకో.! | Local Election Candidates Code Of Conduct | Sakshi
Sakshi News home page

స్థానిక అభ్యర్థీ.. ఇవి తెలుసుకో.!

Published Thu, Mar 12 2020 9:34 AM | Last Updated on Thu, Mar 12 2020 9:34 AM

Local Election Candidates Code Of Conduct - Sakshi

సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రవర్తన నియమావళి ఈ నెల 7 నుంచే అమల్లోకి వచ్చింది. ఎన్నికల్‌ కోడ్‌ను అందరూ కచ్చితంగా పాటించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గీత దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయ్యే వరకూ కోడ్‌ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ప్రశాంతయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అభ్యర్థులంతా సహకరించాలని కోరుతున్నారు. అభ్యర్థులకు, పారీ్టలకు పలు సూచనలు అందిస్తున్నారు. 

ఇవి చేయొద్దు..
ప్రజల మధ్య విద్వేషాలు రేకెత్తించేలా, ఉద్రిక్తతలకు కారణమయ్యేలా, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఏ పార్టీ అభ్యర్థి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు. జాతి, కులం, మతం, ప్రాంతం పేర్లతో ఓట్లు అడగకూడదు. 
ఆలయాలు, మసీదులు, చర్చిలను ఎన్నికల ప్రచారానికి వినియోగించకూడదు. 
అభ్యర్థుల వ్యక్తిగత జీవితం, అంశాల ప్రస్తావనను ఓటర్ల వద్ద తీసుకురాకూడదు. ఎవరి గురించి అయినా వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ఆరోపణలు చేయకూడదు. 
ప్రైవేటు, ప్రభుత్వ భవనాలపై వాటి యాజమాని, సంబంధిత అధికారి అనుమతి లేకుండా జెండా కట్టడం, పోస్టర్లు అతికించడం, నినాదాలు రాయడం చేయకూడదు. అనుమతి ఉంటే సంబంధిత పత్రాలను ఎన్నికల అధికారికి ఇవ్వాలి. 
ఒక అభ్యరి్థ, అతని అనుచరులు మరో పార్టీ వారి జెండాలు, పోస్టర్లను తొలగించకూడదు. 
ఒక పార్టీకి చెందిన అభ్యర్థి ఇతర పారీ్టల నాయకుల దిష్టిబొమ్మలను ఊరేగించడం, తగలబెట్టడం, ప్రదర్శించడం చేయకూడదు. 

ఊరేగింపుల్లో పోలీసుల సాయం 
ఊరేగింపు ప్రారంభానికి ముందే తేదీ, సమయం, మార్గం, ముగింపు ప్రదేశం, నిర్వహించే అభ్యర్థి వివరాలు తెలియజేయాలి. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. ఆ మార్గంలో నిషేధ ఆజ్ఞలు ఉంటే మినహాయింపు కోరుతూ ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి. రెండు, అంతకు మించి రాజకీయ పారీ్టలు ఒకే మార్గంలో ఊరేగింపు చేయాల్సి వస్తే ఒకరికొకరు ఎదురు పడకుండా చూడాలి. పోలీసుల సాయం తప్పనిసరిగా తీసుకోవాలి. 

వీటికి దూరంగా ఉండాలి.. 
అవినీతి, నేరాలకు అభ్యర్థులు దూరంగా ఉండాలి. 
మతం, కులం, వర్గం ప్రాతిపదికన ఓటు వేయమని, వేయవద్దని కోరడం చేయరాదు. ఓటుకోసం మతపరమైన గుర్తుల వినియోగం చేయకూడదు. 
ముద్రించేవారు, ప్రచురించే వారి పేర్లు లేకుండా కరపత్రాలు, పోస్టర్లు, సర్కులర్లు, ఇతర ప్రకటనలు ఇవ్వరాదు. 
ఒక అభ్యర్థి వ్యక్తిగత ప్రవర్తన, నడవడికకు సంబంధించి అవాస్తవాలతో కూడిన ప్రకటనలు ఇవ్వడం, వార్తాంశాలను ప్రచురించడం చేయరాదు. 
ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఏర్పాటు చేసిన సమావేశాలు, సభలను అడ్డుకోవడం సరికాదు. 
ఓటర్లకు ఏ రూపంలోనూ లంచం, బహుమతులు ఇవ్వరాదు. 
పోలింగ్‌ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ప్రచారం ఉండాలి. 
పోలింగ్‌ రోజున ఓటర్లకు ప్రయాణ సౌకర్యం కలి్పంచడం నేరం. 
పోలింగ్‌ కేంద్రాల సమీపంలో క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం, పోలింగ్‌ అధికారి విధులను అడ్డగించడం చేయరాదు. 
మరొకరి ఓటు వేయడానికి ప్రయత్నం చేయకూడదు. 

అనుమతి ఉంటేనే...
అధికారుల అనుమతి లేకుండా బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే బహిరంగ సభలు, సమావేశాల వద్ద మైకులను వినియోగించాలి. ఇతర సందర్భాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే ఉపయోగించాలి. 
ఆస్పత్రుల్లోని రోగులకు అసౌకర్యాం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల అనుమతి లేకుండా ఉపన్యాసాలు, రికార్డు చేసిన ప్రసంగాలను వినిపించకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు వాటిని జప్తు చేయవచ్చు. 
బహిరంగ ప్రదేశాల్లో ఎన్నికల సభలు నిర్వహించడానికి అనుమతి మంజూరు విషయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీ మధ్య పక్షపాతం చూపకూడదు. ఒకే ప్రదేశంలో ఒకే తేదీ, ఒకే సమయంలో సమావేశాలకు ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తు వస్తే.. మొదటగా అందినదానికి అనుమతి ఇవ్వాలి. 

మరిన్ని నిబంధనలు 
ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పోటీ చేస్తే అభ్యరి్థ, రాజకీయ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు.  
ఎన్నికల పర్యటనలో భాగంగా ఎవరైనా ఒక వ్యక్తి ఆహా్వనం మేరకు మంత్రి హాజరైనా ప్రభుత్వ ఉద్యోగి అందులో పాల్గొనకూడదు. 
ఎన్నికల సమావేశాలు నిర్వహించే మైదానాలు, హెలిప్యాడ్లు తదితర బహిరంగ ప్రదేశాల విషయంలో అధికార పార్టీ గుత్తాధిపత్యం చూపకూడదు. అధికార పార్టీ ఏ నియమాల ప్రకారం ఉపయోగిస్తుందో.. అవే నియమాలపై ఇతర పార్టీ అభ్యర్థులకూ అనుమతించాలి 
విశ్రాంతి భవనాలు, సర్క్యూట్‌ హౌస్‌లు, ఇతర ప్రభుత్వ వసతి వినియోగంలోనూ.. అలాగే ఎన్నికల ప్రచారం నిమిత్తం భవనాలు, వాటి పరికరాలను వినియోగంచడానికి అనుమతి ఇవ్వరాదు.  
ఎయిడెట్‌ విద్యాసంస్థలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సాయం పొందే, ఇతర ఏదైనా విద్యా సంస్థల యాజమన్యానికి బాధ్యులుగా ఉన్న వారితో సంబంధం ఉండకూడదు. అభ్యర్థి ఎన్నిక అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు ఆ సంస్థకు చెందిన భవనాలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది, విధులు, వాహనాలను వినియోగించకూడదు.  
అన్ని సమావేశాలను ఎన్నికల సమావేశాలుగా పరిగణించాలి. వాటికి ప్రభుత్వ నిధులు వినియోగించకూడదు. శాంతి భద్రతల విధులు నిర్వహించే వారు తప్ప ఇతర ప్రభుత్వ ఉద్యోగులు హాజరు కాకూడదు. ఒక మంత్రి ఎన్నికలు జరిగే ప్రాంతానికి పర్యటనకు వెళ్తే అది ఎన్నికల పర్యటన కిందనే గుర్తించాలి. పర్యటనకు ప్రభుత్వ వాహనాలను ఇతర సౌకర్యాలను కల్పించకూడదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement