ధంకర్, ఆనందీబెన్, రమేశ్ బైస్, లాల్జీ టాండన్
న్యూఢిల్లీ: కేంద్రం నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు ఉత్తరప్రదేశ్, బిహార్ గవర్నర్లకు స్థానచలనం కలిగించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా మాజీ ఎంపీ, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది జగ్దీప్ ధంకర్(68)ను నియమిస్తూ శనివారం రాష్ట్రపతి భవన్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. వచ్చే వారం పదవీ విరమణ చేయనున్న కేసరీనాథ్ త్రిపాఠీ స్థానంలో ధంకర్ బాధ్యతలు చేపడతారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. బెంగాల్‌లో రాజకీయ ఆధిపత్యం కోసం బీజేపీ, మమతా బెనర్జీల మధ్య పోరు కొనసాగుతున్న సమయంలో ఈ నియామకం చేపట్టడం గమనార్హం.
ధంకర్ 1990–91 సంవత్సరాల మధ్య పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. 2003లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే, 2018 జనవరి నుంచి మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆనందీబెన్ పటేల్‌ను కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమించింది. ఆనందీ బెన్ స్థానంలో బీజేపీ కురువృద్ధ నేత, బిహార్ గవర్నర్ లాల్జీ టాండన్‌ను మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. టాండన్ స్థానంలో బిహార్ గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత ఫగు చౌహాన్ బాధ్యతలు చేపడతారని ఆ సర్క్యులర్ వెల్లడించింది.
త్రిపుర గవర్నర్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత రమేశ్ బైస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి పదవీ కాలం 27న ముగియనుంది. నాగాలాండ్ గవర్నర్‌గా ఇంటెలిజెన్స్ బ్యూరో రిటైర్డు స్పెషల్ డైరెక్టర్ ఎన్.రవి నియమితులయ్యారు. 1976 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రవి నాగా వేర్పాటువాదులతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ తెలిపింది. 1950లో యూపీ ఏర్పడిన తర్వాత మొదటి మహిళా గవర్నర్ ఆనందీబెన్. అంతకుముందు ఉన్న యునైటెడ్ ప్రావిన్సుకు 1947లో సరోజినీ నాయుడు గవర్నర్‌గా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment