న్యూఢిల్లీ: నో యువర్ క్లయింట్ (కేవైసీ) వివరాలు సమగ్రంగా లేకపోతే ఇన్వెస్టర్ల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ చేసే నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుక్రవారం విడుదల చేసింది. ఇవి ఆగస్టు 31 నుంచి అమల్లోకి వస్తాయని ఒక సర్క్యులర్‌లో తెలిపింది. కేవైసీ ప్రక్రియలో చిరునామాలు అత్యంత కీలకమని సెబీ స్పష్టం చేసింది. సాధారణంగా ఇన్వెస్టర్ల చిరునామాలను మధ్యవర్తిత్వ సంస్థ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదని గుర్తించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజా నిబంధనలు రూపొందించినట్లు వివరించింది.
వీటి ప్రకారం సెబీ జారీ చేసే ఆదేశాలు మొదలైన వాటిని ఏ ఎంఐఐ (మార్కెట్ ఇన్‌ఫ్రా సంస్థ) కూడా ఇన్వెస్టర్‌కి అందజేసి, రసీదు తీసుకోలేకపోయిన పక్షంలో .. డెలివరీ విఫలమైన తేదీ నుంచి అయిదు రోజుల్లో అన్ని ఎంఐఐలు సదరు మదుపుదారు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను డీయాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అయితే, కేవలం ఒకే ఎంఐఐ విఫలమైతే మాత్రం ఖాతాల డీయాక్టివేషన్ ఉండదని సెబీ తెలిపింది. అలాగే, తగిన పత్రాలన్నింటితో దర ఖాస్తు చేసుకుంటే ఎంఐఐలు అయిదు రోజుల్లోగా రీయాక్టివేట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment