Know Your Customer (KYC)
-
ఆధార్‌తో లింకేజీ లేకుంటే పాన్‌కార్డు నిష్ఫలమే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి 31వ తేదీనాటికి ఆధార్‌తో అనుసంధానంకాని పర్మినెంట్ అకౌంట్ నంబర్(పాన్) కార్డులు క్రియాశీలకంగా ఉండబోవని ఆదాయ పన్ను శాఖ ఒక బహిరంగ ప్రకటనలో పేర్కొంది. ‘ఆదాయపన్ను చట్టం–1961 ప్రకారం ఎలాంటి మినహాయింపుల పరిధిలోకిరాని పాన్ కార్డు వినియోగదారులు తమ కార్డును ఆధార్‌తో వచ్చే ఏడాది మార్చి 31వ తేదీకల్లా అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆధార్‌తో అనుసంధానించని పాన్ కార్డులు ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి మనుగడలో ఉండవు. వాటిని ఇన్ఆపరేటివ్గా భావించాలి’ అని ఐటీ శాఖ ఆ బహిరంగ ప్రకటనలో స్పష్టంచేసింది. పాన్ కార్డు మనుగడలో లేకపోతే ఐటీ చట్టం ప్రకారం సంబంధిత కార్డు హోల్డర్ చట్టపరంగా పలు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదముందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మార్చి 30న ఒక సర్క్యులర్‌లో పేర్కొనడం తెల్సిందే. క్రియాశీలకంగాలేని పాన్ కార్డుతో ఐటీ రిటర్న్‌లు దాఖలుచేయడం వీలుకాదు. పెండింగ్‌లో ఉన్న రీఫండ్లు తిరిగిరావు. కట్టాల్సిన పన్నులకు మించి అధికంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. నో యువర్ కస్టమర్(కేవైసీ) తప్పనిసరి అయిన బ్యాంక్‌లు, ఆర్థిక సంబంధ వెబ్సైట్లలో పాన్‌కార్డు ఖచ్చితం చేసిన నేపథ్యంలో ఇకపై వారు వాటి ద్వారా నగదు బదిలీ, ఆర్థిక లావాదేవీలు జరపడం దాదాపు అసాధ్యం. సాధారణంగా ఐటీ శాఖకు సంబంధించిన విధానపర నిర్ణయాలను సీబీడీటీనే నిర్ణయిస్తుంది. 2017 మే నెలలో కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన ఒక నోటిఫికేషన్లో ఆ ‘మినహాయింపు కేటగి రీ’ని పేర్కొంది. అస్సాం, జమ్మూకశ్మీర్, మేఘాల యలో ఉండేవారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఐటీ చట్టం–1961 ప్రకారం స్థానికే తరులు, 80 ఏళ్లు దాటిన వారు, భారతపౌరులు కాని వారికి ఈ మినహాయింపు ఉంది. -
కేవైసీ లేకుంటే ఆటోమేటిక్‌గా ట్రేడింగ్ ఖాతాల డీయాక్టివేషన్
న్యూఢిల్లీ: నో యువర్ క్లయింట్ (కేవైసీ) వివరాలు సమగ్రంగా లేకపోతే ఇన్వెస్టర్ల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ చేసే నిబంధనలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుక్రవారం విడుదల చేసింది. ఇవి ఆగస్టు 31 నుంచి అమల్లోకి వస్తాయని ఒక సర్క్యులర్‌లో తెలిపింది. కేవైసీ ప్రక్రియలో చిరునామాలు అత్యంత కీలకమని సెబీ స్పష్టం చేసింది. సాధారణంగా ఇన్వెస్టర్ల చిరునామాలను మధ్యవర్తిత్వ సంస్థ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదని గుర్తించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తాజా నిబంధనలు రూపొందించినట్లు వివరించింది. వీటి ప్రకారం సెబీ జారీ చేసే ఆదేశాలు మొదలైన వాటిని ఏ ఎంఐఐ (మార్కెట్ ఇన్ఫ్రా సంస్థ) కూడా ఇన్వెస్టర్‌కి అందజేసి, రసీదు తీసుకోలేకపోయిన పక్షంలో .. డెలివరీ విఫలమైన తేదీ నుంచి అయిదు రోజుల్లో అన్ని ఎంఐఐలు సదరు మదుపుదారు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలను డీయాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. అయితే, కేవలం ఒకే ఎంఐఐ విఫలమైతే మాత్రం ఖాతాల డీయాక్టివేషన్ ఉండదని సెబీ తెలిపింది. అలాగే, తగిన పత్రాలన్నింటితో దర ఖాస్తు చేసుకుంటే ఎంఐఐలు అయిదు రోజుల్లోగా రీయాక్టివేట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. -
రూ. 20 కడితే ఆధార్ సర్వీసులు
న్యూఢిల్లీ: కస్టమర్ ధ్రువీకరణ కోసం (కేవైసీ) ఆధార్ సర్వీసులు వినియోగించుకోవాలంటే వ్యాపార సంస్థలు ఇకపై ప్రతి వెరిఫికేషన్‌కు రూ. 20 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఆయా సంస్థలు జరిపే ప్రతి లావాదేవీ ధృవీకరణ కోసం 0.50 పైసలు చెల్లించాల్సి రానుంది. విశిష్ట ప్రాధికార గుర్తింపు కార్డుల సంస్థ (యూఐడీఏఐ) గురువారం ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘ఆధార్ ధృవీకరణ సర్వీసులకోసం ప్రతి ఈ–కేవైసీ లావాదేవికి రూ. 20 (పన్నులు సహా), ఇతరత్రా ప్రతి లావాదేవీ ధృవీకరణ (యస్ లేదా నో) కోసం రూ. 0.50 (పన్నులు సహా) చెల్లించాల్సి ఉంటుంది. అని పేర్కొంది. ‘ఆధార్ లేకుండా కేవైసీ ధృవీకరణ జరపాలంటే ప్రస్తుతం వ్యాపార సంస్థలకు దాదాపు రూ. 150–200 దాకా ఖర్చవుతోంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే ఆధార్ ఆధారిత కేవైసీ ధృవీకరణతో ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. దీంతో సౌలభ్యం దృష్ట్యా ఆధార్ ఆధారిత కేవైసీ సర్వీసుల కోసం ఆయా సంస్థలు కోరుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకోవడం జరిగింది‘ అని అధికారిక వర్గాలు తెలిపాయి. నోటిఫికేషన్ ప్రకారం.. ► ఆధార్ సేవలను వినియోగించుకున్నాక ఇన్వాయిస్ వచ్చిన 15 రోజుల్లోగా వ్యాపార సంస్థలు నిర్దేశిత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గడువు దాటిన పక్షంలో నెలకు 1.5 శాతం చొప్పున వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ–కేవైసీ సేవలు కూడా నిల్చిపోతాయి. ► ఇప్పటికే ఆధార్ ఆధారిత ధృవీకరణ సర్వీసులు వినియోగించుకుంటున్న సంస్థలు.. తాజా నోటిఫికేషన్ విడుదల తర్వాత కూడా కొనసాగించిన పక్షంలో ఆయా సంస్థలు నిర్దేశిత నిబంధనలు, చార్జీలను అంగీకరించినట్లుగానే భావించడం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆధార్ ఆర్డినెన్స్‌కు సవరణల కారణంగా ఆధార్ ఆథెంటికేషన్ సేవలు పొందేందుకు పలు సంస్థలకు అర్హత లభించినట్లవుతుందని వివరించాయి. అయితే, ఆయా సంస్థలు భద్రతాపరమైన షరతులన్నింటినీ పక్కాగా అమలుచేయాల్సి ఉంటుంది. ► ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్ సేవలు అందిస్తునన్న షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు ఆథెంటికేషన్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, ఆధార్ నమోదు, అప్డేట్ లక్ష్యాలను అవి చేరలేకపోతే.. టార్గెట్‌కి తగ్గట్లుగా నిర్దేశిత మొత్తం కట్టాల్సి ఉంటుంది. -
కేవైసీ వివరాలివ్వకుంటే బ్యాంక్ ఖాతాల నిలుపుదల
ముంబై: పదేపదే కోరినప్పటికీ నో యువర్ కస్టమర్(కేవైసీ) వివరాలను అందించకుంటే ఆ ఖాతాలను తొలుత పాక్షికంగా నిలిపి వేసేందుకు బ్యాంకులకు వీలు చిక్కింది. ఇందుకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేవైసీ వివరాలను ఇవ్వని కస్టమర్ల ఖాతాలను దశలవారీగా స్థంభింపచేయమంటూ బ్యాంకులను ఆర్బీఐ తాజాగా ఆదేశించింది. అప్పటికీ కస్టమర్లు స్పందించకుంటే ఆపై ఖాతాలను పూర్తిగా మూసివేయమంటూ సూచించింది. ఈ ఆదేశాలలో భాగంగా బ్యాంకులు ఖాతాదారులకు తొలి దశకింద మూడు నెలల సమయాన్ని ఇస్తాయి. ఆపై ఖాతాలను పాక్షికంగా నిలిపివేస్తాయి. దీంతో నగదు జమలకు అవకాశముంటుందిగానీ, ఉపసంహరణకు వీలుండదు. కాగా, ఇది జరిగిన తదుపరి మరో మూడు నెలల కాలం బ్యాంకులు వేచిచూస్తాయి. ఖాతాలను పాక్షికంగా నిలిపివేసిన ఆరు నెలలకుకూడా వివరాలు లభించకుంటే ఆపై ఖాతాలను పూర్తిస్థాయిలో స్థంభింపచేసేందుకు అవకాశముంటుంది.