కేవైసీ వివరాలివ్వకుంటే బ్యాంక్ ఖాతాల నిలుపుదల
ముంబై: పదేపదే కోరినప్పటికీ నో యువర్ కస్టమర్(కేవైసీ) వివరాలను అందించకుంటే ఆ ఖాతాలను తొలుత పాక్షికంగా నిలిపి వేసేందుకు బ్యాంకులకు వీలు చిక్కింది. ఇందుకు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేవైసీ వివరాలను ఇవ్వని కస్టమర్ల ఖాతాలను దశలవారీగా స్థంభింపచేయమంటూ బ్యాంకులను ఆర్‌బీఐ తాజాగా ఆదేశించింది. అప్పటికీ కస్టమర్లు స్పందించకుంటే ఆపై ఖాతాలను పూర్తిగా మూసివేయమంటూ సూచించింది.
ఈ ఆదేశాలలో భాగంగా బ్యాంకులు ఖాతాదారులకు తొలి దశకింద మూడు నెలల సమయాన్ని ఇస్తాయి. ఆపై ఖాతాలను పాక్షికంగా నిలిపివేస్తాయి. దీంతో నగదు జమలకు అవకాశముంటుందిగానీ, ఉపసంహరణకు వీలుండదు. కాగా, ఇది జరిగిన తదుపరి మరో మూడు నెలల కాలం బ్యాంకులు వేచిచూస్తాయి. ఖాతాలను పాక్షికంగా నిలిపివేసిన ఆరు నెలలకుకూడా వివరాలు లభించకుంటే ఆపై ఖాతాలను పూర్తిస్థాయిలో స్థంభింపచేసేందుకు అవకాశముంటుంది.