న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌లో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులనే వచ్చే నెల ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లోనూ కొనసాగించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సూచనప్రాయంగా వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం తెలిసిందే. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ జూలై 5న పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
మధ్యంతర బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకోకుండా పక్కన పెట్టిన వాటికి అవసరమైతేనే అదనపు కేటాయింపులు పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ‘2019–20 మధ్యంతర బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనల్లో మార్పులుండవు‘ అని సర్క్యులర్‌లో ఆర్థిక శాఖ పేర్కొంది. కొత్తగా ఏర్పాటైన 17వ లోక్‌సభ.. జూన్ 17 నుంచి జూలై 26 దాకా సమావేశం కానుంది. జూలై 4న 2019–20 ఆర్థిక సర్వేను, ఆ మరుసటి రోజు 5వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం, బ్యాంకుల మొండి బాకీలు .. ఎన్‌బీఎఫ్‌సీల నిధులపరమైన సమస్యలు, ఉపాధి కల్పన, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతుల పునరుద్ధరణ, వ్యవసాయ రంగ సమస్యలు, ఆర్థిక క్రమశిక్షణ తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం తదితర సవాళ్లు నిర్మలా సీతారామన్ ముందు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment