కేంద్ర బడ్జెట్ 2025-26(Budget 2025-26) తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ(Finance Ministry) నేడు సంప్రదాయ హల్వా వేడుకను నిర్వహిస్తుంది. ఈ వేడుకలు పార్లమెంట్ నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు పూర్తవుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో నిర్వహించే ఈ వేడుకకు బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాలుపంచుకున్న అధికారులు పాల్గొంటారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వీరు పార్లమెంట్‌లోని మంత్రిత్వ శాఖ ప్రాంగణానికే పరిమితం అవుతారు.
ఎలా జరుపుకుంటారు..?
భారతీయ తీపి వంటకం హల్వాను నార్త్ బ్లాక్ వద్ద పెద్ద కడాయిలో తయారు చేస్తారు. బడ్జెట్ తయారీలో పాల్గొన్న వారందరికీ ఆర్థిక మంత్రి సంప్రదాయబద్ధంగా కడాయి వెలిగించి హల్వా వడ్డిస్తారు. ఈ కార్యక్రమం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల కృషిని గుర్తించడమే కాకుండా, బడ్జెట్ పత్రాలన్నింటినీ ముద్రించే ప్రక్రియకు నాంది పలుకుతుంది.
ఎవరు పాల్గొంటారు..?
కేంద్రమంత్రి ఈ ఏడాది వేడుకలకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి, కార్యదర్శులు, బడ్జెట్ తయారీ, సంకలన ప్రక్రియలో ఉన్న అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగియనుండగా, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఇదీ చదవండి: రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు
1980 నుంచే హల్వా వేడుక
బడ్జెట్ తయారీ ప్రక్రియ గోప్యతకు ప్రతీకగా హల్వా వేడుక 1980 నుంచి జరుపుకుంటున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ నెలకొల్పిన రికార్డును అధిగమించి నిర్మలా సీతారామన్ తన ఏడో పూర్తికాల బడ్జెట్‌ను ఈసారి ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 పాలనలో కీలక ప్రకటనలు, ఆర్థిక మార్గదర్శకాల కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల అంకితభావం, కృషికి హల్వా వేడుక నిదర్శనంగా నిలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment