యూరప్ యూనియన్(ఈయూ) నుంచి నిష్క్రమించే బ్రెగ్జిట్ ప్రక్రియ సజావుగా ముగుస్తుందా లేదా అని ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన బ్రిటన్ పౌరులకు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ క్రిస్మస్ పర్వదినాన బ్రస్సెల్స్ నుంచి మంచి కబురు అందించారు. ఈయూ నుంచి వైదొలగడానికి సంబంధించిన ఒప్పందానికి ఇక కేవలం ఏడు రోజులే గడువుండగా ఎవరూ ఊహించని రీతిలో దీనికి శుభం కార్డు పడింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 1 నుంచి లాంఛనంగా బ్రిటన్ ఈయూ నుంచి బయటికొచ్చింది. కానీ దానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఒప్పందం కుదరడానికి మళ్లీ ఏడాది పట్టింది. ఒకటా రెండా... నాలుగేళ్లుగా అటు ఈయూకూ, ఇటు బ్రిటన్‌కూ ఇదొక సంక్లిష్ట సమస్యగా మారింది. ఎడతెగకుండా సాగిన చర్చలు ప్రతిసారీ ప్రతిష్టంభనలోనే ముగిసి ఉసూరనిపించాయి.
ఒప్పందం వల్ల జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడటం.... అందుకు అనువైన రీతిలో ఈయూను ఒప్పించడం జాన్సన్‌కు పెను సమస్యగా మారింది. ఒక దశలో విసుగెత్తి ఒప్పందం లేకున్నా ఖాతరు చేసేది లేదని, దేనికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. అటు ఈయూకు సైతం ఇది జీవన్మరణ సమస్యే. బయటికెళ్లిన బ్రిటన్‌కు అంతా బాగుందని, అందువల్ల అది ఎంతో లాభపడిందని ఇతర సభ్య దేశాలు అనుకుంటే ఈయూ నుంచి ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తారు. వెళ్లిపోవడం వల్ల అది ఎంతో నష్టపోయిందన్న అభిప్రాయం కలగడం దాని మనుగడకు ముఖ్యం. కనుకనే ఒప్పందం కుదరడానికి నాలుగేళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. అయితే తాజాగా ఒప్పందం కుదిరిందంటూ చేసిన ప్రకటనతోపాటు విడుదలైన జాన్సన్ ఫొటో చూస్తే అంతా బ్రిటన్‌కు అనుకూలంగానే ముగిసిందన్న అభిప్రాయం అందరికీ కలుగుతుంది.
అటు ఈయూ కూడా ఈ ఒప్పందం ఇరుపక్షాలకూ ప్రయోజనం చేకూర్చేదని, న్యాయమైనదని అంటోంది. అయితే ఇంతమాత్రం చేత ఇంకా అంతా అయిపోయినట్టు కాదు. ఈ ఒప్పందాన్ని జాన్సన్ బ్రిటన్ పార్లమెంట్ ముందుంచి దాని ధ్రువీకరణ పొందాలి. అందుకోసం మరో అయిదు రోజుల్లో బ్రిటన్ పార్లమెంటు సమావేశం కాబోతోంది. అటు 27 మంది ఈయూ పెద్దలు సభ్య దేశాల రాయబారులనూ సమావేశపరిచి ఒప్పంద వివరాలు చెప్పడం క్రిస్మస్ రోజునే మొదలైంది. ఈ రాయబారులంతా వెనువెంటనే స్వదేశాలకెళ్లి అధినేతలకు ఒప్పందాన్ని వివరిస్తారు. అన్ని దేశాల పార్లమెంటులూ ఈ నెలాఖరుకల్లా ఒప్పందంపై ఆమోదముద్ర వేయాలి. ఇది నష్టదాయకమైనదని ఏ దేశం భావించినా ఒప్పందాన్ని వీటో చేయొచ్చు. ఈ ప్రక్రియ సాఫీగా ముగిసిపోతే ఈయూ పార్లమెంటు వచ్చే నెల మొదట్లో ఒప్పందాన్ని పరిశీలించడం మొదలెడుతుంది. అది ధ్రువీకరించేవరకూ దీన్ని తాత్కాలిక ఒప్పందంగానే పరిగణిస్తారు.
బ్రెగ్జిట్ భూతం 2016లో డేవిడ్ కామెరాన్, నిరుడు థెరిస్సా మే జాతకాలను తలకిందులు చేసింది. వారిద్దరూ అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు ఎన్నికలు తప్పలేదు. థెరిస్సా మే స్థానంలో వచ్చిన బోరిస్ జాన్సన్ గత ఏడాది అక్టోబర్‌లో కూడా ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. అది కాస్తా పార్లమెంటులో వీగిపోవటంతో ఆయన ప్రభుత్వం రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సివచ్చింది. తిరిగి మళ్లీ ప్రధాని అయిన దగ్గరినుంచి ఆయన బ్రెగ్జిట్‌పైనే అధిక సమయం వెచ్చించారు. ఒకపక్క హఠాత్తుగా విరుచుకుపడిన కరోనా మహమ్మారితో దేశం అయోమయావస్థలో పడగా... ఆయనే ఆ వ్యాధిబారిన పడ్డారు. ఇలా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. ఇంతకూ ఒప్పందంలో ఏముంది? ఇరు పక్షాలూ చెప్పుకుంటున్నట్టు అది ఉభయత్రా ప్రయోజనకరమైనదేనా... లేక పాత ఒప్పందాల మాదిరే దీన్ని కూడా పార్లమెంటు విసిరికొడుతుందా అన్నది తేలడానికి మరికొన్ని రోజులు పడుతుంది.
1,800 పేజీలున్న ఒప్పందంలో ఇరుపక్షాల సంబంధాలపైనా అనేకానేక నిబంధనలున్నాయి. ఇటు బ్రిటన్, అటు ఈయూ వేర్వేరుగా మనుగడ సాగిస్తూ వాణిజ్యరంగంలో కలిసి పనిచేయడానికి ఏమేం పాటించాలో, ఉత్పత్తయ్యే సరుకుపై విధించే పన్నులు ఎలా వుండాలో చెప్పే నిబంధనలవి. ఒక దేశంగా బ్రిటన్‌కు ఇకపై పూర్తి సార్వభౌమాధికారం చేతికొచ్చినట్టే. అది తన భవిష్యత్తును తానే నిర్దేశించుకోగలుగుతుంది. ఇకపై ఈయూ నియమ నిబంధనలు వర్తించవు. నచ్చిన చట్టాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు. ఈయూ ధ్రువీకరణ అవసరం లేదు. యూరపియన్ న్యాయస్థానం బెడద వుండదు. బ్రిటన్ పౌరులు ఈయూ ప్రాంత దేశాలకు వెళ్లాలన్నా, అక్కడివారు ఇటు రావాలన్నా ఇకపై వీసా తప్పనిసరి కావొచ్చు. బ్రిటన్ పరిధిలోని ఇంగ్లిష్ చానెల్‌లో చేపలు పట్టడానికి ఈయూ ఫిషింగ్ బోట్లకు అనుమతులు అవసరమవుతాయి. ఈయూ ఏటా 60 లక్షల టన్నుల చేపల్ని ఎగుమతి చేస్తుంది. అందులో ఏడు లక్షల టన్నులు ఇంగ్లిష్ చానెల్, ఇతర కెనాల్స్‌లో లభిస్తాయి. దీని విలువ 65 కోట్ల పౌండ్లు. ఇదే ఒప్పందం కుదరడానికి అడ్డంకిగా మారింది. చివరకు ఏకాభిప్రాయం కుదిరింది.
అయితే ప్రశ్నలు చాలానే వున్నాయి. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సేవారంగంపై ఆధారపడివుంటుంది. ఆ రంగానికి ఈయూ ప్రాంత దేశాల్లో అవకాశాలెలా వుంటాయో తెలియదు. ఎందుకంటే ఈ ఒప్పందంలో దాని ఊసే లేదు. ముఖ్యంగా విత్త సంబంధ సేవారంగం పరిస్థితేమిటో అగమ్యగోచరం. ఆ రంగానికి ఈయూ ఏమేరకు చోటిస్తుందో చూడాలి. ఏడాది క్రితం కుదిరిన అవగాహనకు భిన్నంగా ఇటీవలే అంతర్గత మార్కెట్లకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకొచ్చింది. అది ఈయూకు మింగుడుపడటం లేదు. బిల్లును వెనక్కి తీసుకోనట్టయితే ప్రతీకార చర్యలుంటాయని అది హెచ్చరించింది. ఇలాంటి సమస్యలు ఇకముందూ తప్పకపోవచ్చు. మొత్తానికి బ్రిటన్ ఈయూతో వున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని వదులుకుని బయటికొచ్చింది. ఇందువల్ల అది జీడీపీలో 4 శాతం కోల్పోతుంది. ఒప్పందం లేకుండా బయటికొస్తే ఇది 6 శాతం మేర వుండేది. తదుపరి దశలు కూడా సాఫీగా పూర్తయితే అది జాన్సన్ ప్రతిష్టను మరింత పెంచుతుంది.
Comments
Please login to add a commentAdd a comment