Cake Mixing: కేక్స్‌ మిక్స్‌..టేస్ట్‌ అదుర్స్‌.. | Cake Mixing: Christmas Festival Noise Started in Hyderabad | Sakshi
Sakshi News home page

Cake Mixing: కేక్స్‌ మిక్స్‌..టేస్ట్‌ అదుర్స్‌..

Published Mon, Dec 9 2024 6:55 AM | Last Updated on Mon, Dec 9 2024 9:48 AM

Cake Mixing: Christmas Festival Noise Started in Hyderabad

కల్చరల్‌ డైవర్సిటీలో మరోసారి  హైదరాబాద్‌ టాప్‌  

వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌తో ప్రిపరేషన్‌

నూతనోత్సాహంతో ప్రజల భాగస్వామ్యం

నగరంలో కొనసాగుతున్న సందడి

స్టార్‌ హోటల్స్‌ మొదలు.. ప్రముఖ సంస్థల్లోనూ  

వినోదాన్ని పంచే గ్రేప్‌ స్టాంపింగ్‌..  

డిసెంబర్‌ వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ నగరం నూతనోత్సాహాన్ని పుంజుకుంటుంది. ఒకవైపు ఇయర్‌ ఎండ్, న్యూ ఇయర్‌ వేడుకలు, మరోవైపు క్రిస్మస్‌ సంబరాలతో నగరం అంతా పార్టీ మూడ్‌లో ఉంటుంది. ఇందులో భాగంగా నగరంలో ఇప్పటికే విభిన్న వేదికల్లో వినోద కార్యక్రమాలు, వేడుకలు మొదలయ్యాయి. కల్చరల్‌ డైవర్సిటీకి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్‌లో సర్వమత సమ్మేళనంలో భాగంగా క్రిస్మస్‌ వేడుకలు సైతం ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రీ క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా కేక్‌ మిక్సింగ్‌ సందడి నెలకొంది. నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు ఇయర్‌ ఎండ్‌ వేడుకలకు కూడా సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించే కేక్‌ మిక్సింగ్‌పైనే ఈ కథనం.. 

నగరంలో గత కొన్ని సంవత్సరాలుగా కేక్‌ మిక్సింగ్‌.. ట్రెండ్‌ కొనసాగుతోంది. మొదట్లో క్రిస్మస్‌ ఫ్రీ ఈవెంట్స్‌లో భాగంగా కేక్‌ మిక్సింగ్‌ నిర్వహించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కేక్‌ మిక్సింగ్‌లో పాల్గొంటూ వినూత్న సంస్కృతికి నాంది పలుకుతున్నారు. నగరంలోని ఫైవ్‌ స్టార్‌ హోటల్స్, రిసార్ట్స్, ఎన్జీవోలు, విద్యా వ్యాపార సంస్థల్లో, ఇతర ఎంటర్‌టైన్మెంట్‌ వేదికలుగా కేక్‌ మిక్సింగ్‌ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లలో పలువురు సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నోవోటెల్‌ హైదరాబాద్, గోల్కొండ హోటల్, తాజ్‌ కృష్ణ, తాజ్‌ వివంత వంటి ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌తో పాటు ఇతర వేదికల్లో కేక్‌ మిక్సింగ్‌ వేడుకలు మొదలై కొనసాగుతూనే ఉన్నాయి.

సెలిబ్రిటీల సందడి.. 
నగర జీవన శైలిలో భాగమైన ఈ కార్యక్రమాలకు సెలిబ్రిటీల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. నిర్వాహకులు సైతం పలువురు సెలిబ్రిటీలు, సామాజికవేత్తలు, ఐకానిక్‌ వ్యక్తులను ఈ కేక్‌ మిక్సింగ్‌ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆహా్వనిస్తూ నగరవాసులను తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది నగర వేదికగా ఇప్పటికే జరిగిన పలు వేడుకల్లో సినీ తారలు, సింగర్లు, స్పోర్ట్స్‌ స్టార్స్‌          పాల్గొని సందడి చేశారు.

వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌.. 
ప్రీ క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా, కేక్‌ మిక్సింగ్, గ్రేప్‌ స్టాంపింగ్‌ ప్రధానంగా నిర్వహిస్తారు. ఈ కేక్‌ మిక్సింగ్‌లో దాదాపు 25 రకాల డ్రై ఫ్రూట్స్, పలు రకాల స్పైసెస్, రం, బ్రాందీ, విస్కీ లాంటి లిక్కర్‌ కలుపుతారు. ఇందులో వాడే పదార్థాల మిశ్రమం మంచి పోషకాలతో ఆరోగ్య ప్రదాయిని గానూ ఉంటున్నాయి. ఈ మిశ్రమాన్నంతా కొద్ది రోజులపాటు సోక్‌ (పులియ బెట్టడం) చేసి ఆ తరువాత ఫ్లమ్‌ కేక్‌ తయారు చేస్తారు. పాశ్చాత్య సంస్కృతిలో భాగంగా తయారు చేసిన ఈ ఫ్లమ్‌ కేక్‌ క్రిస్మస్‌ వేడుకల్లో అందరికీ ఫేవరెట్‌. కేక్‌ మిక్సింగ్‌లో చిన్నలు, పెద్దలు అందరూ కలిసి లిక్కర్‌తో డ్రై ఫ్రూట్స్‌ కలుపుతూ ఎంజాయ్‌ చేస్తారు.

గ్రేప్‌ స్టాంపింగ్‌.. 
కేక్‌ మిక్సింగ్‌తో పాటు ఈ మధ్యకాలంలో గ్రేప్‌ స్టాంపింగ్‌ విరివిగా నిర్వహిస్తున్నారు. ఈ గ్రేప్‌ స్టాంపింగ్‌లో ఒక పెద్ద చెక్క బుట్టలో అధిక మొత్తంలో ద్రాక్ష పళ్లను వేసి సామూహికంగా వాటిని తొక్కుతూ ద్రాక్ష రసాన్ని తీసి దాని నుండి వైన్‌ తయారు చేస్తారు. ఈ వైన్‌ కూడా క్రిస్మస్‌ వేడుకల్లో ప్రధాన అంశమే ఇలాంటి సాంస్కృతిక వినోదపరమైన కార్యక్రమాలకు నగరంలోని యువత సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులు కూడా అమితాసక్తి చూపిస్తున్నారు. ఈ నెలలో వీకెండ్‌ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసుకొని అందులో పాలుపంచుకుంటున్నారు. ఈ ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. 

నూతనోత్సాహం కోసం.. 
కేక్‌ మిక్సింగ్‌ కూడా మన జీవన పరమార్థాన్ని తెలిపే ఓ వేడుకే. ఈ కేక్‌ మిక్సింగ్‌ లో కలిపే డ్రై ఫ్రూట్స్‌ నట్స్‌ సుగంధద్రవ్యాల లాగే మన అందరి జీవితాలు కలుపుగోలుగా అందంగా ఉండాలని అర్థం. అంతేకాకుండా ప్రతి ఏడాదీ నూతనోత్సాహాన్ని అందించడానికి ముందస్తు వేడుక. నగరంలో ఈ మధ్యకాలంలో ఈ సంస్కృతికి ఆదరణ బాగా పెరిగింది. 
– ఎస్పీ శైలజ, ప్రముఖ సింగర్, (ఈ మధ్య 
జరిగిన ఓ కేక్‌ మిక్సింగ్‌ వేడుకలో 
భాగంగా).

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement