కోల్‌కతా డాక్టర్ హత్యపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఇలాంటి దారుణాలు ఇకపై జరగడానికి వీల్లేదు
మహిళలపై నేరాల పట్ల ఆత్మపరిశీలన చేసుకోవాలి
న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆ భయానక సంఘటన గురించి తెలుసుకొని చలించిపోయానని చెప్పారు. ఇలాంటి దారుణాలు ఇకపై జరగడానికి వీల్లేదని స్పష్టంచేశారు.
మహిళలపై నేరాల పట్ల మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని బుధవారం పీటీఐ వార్తా సంస్థకు రాసిన ప్రత్యేక ఆరి్టకల్‌లో రాష్ట్రపతి సూచించారు. జూనియర్ డాక్టర్ హత్యపై రాష్ట్రపతి స్పందించడం ఇదే మొదటిసారి. తల్లులు, అక్కచెల్లెమ్మలపై జరుగుతున్న అరాచకాలపై దేశం మేల్కోవాల్సిన సమయం వచ్చిందని ఆమె ఉద్ఘాటించారు.
మహిళల పట్ల నీచమైన అభిప్రాయాలు ఉంటే వారిని ఒక వస్తువుగా చూసే అలవాటు పెరుగుతుందని తెలిపారు. స్త్రీలను బలహీనులుగా, తెలివిలేనివారుగా పరిగణించే ఆలోచనా ధోరణిని అందరూ మార్చుకోవాలని హితవు పలికారు. మహిళల పట్ల ప్రజల దృష్టికోణం మారితే సమాజంలో వారిపై నేరాలు జరగబోవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం చెప్పారంటే...
మనం పాఠాలు నేర్చుకున్నామా?
దేశంలో సోదరీమణులపై ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న కోల్‌కతాలో వైద్యురాలపై జరిగిన అఘాయిత్యం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. నాగరిక సమాజంలో ఆడబిడ్డలు ఇలాంటి అరాచకాల బారిన పడడానికి వీల్లేదు. జూనియర్ డాక్టర్ హత్య పట్ల దేశమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో నేను కూడా ఉన్నాను.
కోల్‌కతాలో విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండగానే, మరోచోట నేరగాళ్లు చెలరేగిపోయారు. మహారాష్ట్రలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళలపై నేరాలు జరగకుండా వ్యూహాలు రూపొందించుకున్నాం. ప్రణాళిక అమల్లోకి తీసుకొచ్చాం. అయినా నేరాలు ఆగడం లేదు.
గత 12 ఏళ్లలో లెక్కలేనన్ని దారుణాలు జరిగాయి. కొన్ని మాత్రమే అందరి దృష్టికి వచ్చాయి. మనం నిజంగా పాఠాలు నేర్చుకున్నామా? ఆందోళనలు ముగిసిపోగానే ఘోరాలు మరుగునపడిపోతున్నాయి. వాటిని మనం మర్చిపోతున్నాం. మరో ఘోరం జరిగాక పాత ఘోరాలను గుర్తుచేసుకుంటున్నాం. ఇది సరైన విధానం కాదు.
మహిళలపై వక్రబుద్ధిని మొదట్లోనే అడ్డుకోవాలి
మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి. వాటిని పోరాడి సాధించుకోవాలి. మహిళలకు మరిన్ని హక్కులు దక్కకుండా, హక్కుల విస్తరణ జరగకుండా కొన్ని సామాజిక అచారాలు, సంప్రదాయాలు అడ్డుపడుతున్నాయి. మహిళలను ప్రాణంలేని వస్తువుగా చూసే ధోరణి వారిపై నేరాలకు పురిగొల్పుతోంది. ఈ పరిస్థితిలో కచి్చతంగా మార్పురావాలి. వారి హక్కులను అందరూ గౌరవించాలి.
స్త్రీల పట్ల జనంలో ఉన్న దురభిప్రాయాన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, సమాజంపై ఉంది. చరిత్రను ఎదిరించే సమయం వచ్చింది. స్త్రీలపై నేరాల పట్ల నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారిపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. జరిగిన తప్పులను సరిదిద్దుకోకపోతే సమాజంలోని సగం జనాభా మిగతా సగం జనాభాలాగా నిర్భయంగా జీవించలేదు.
మీడియా ధైర్యంగా పనిచేయాలి
ప్రసార మాధ్యమాలు ధైర్యంగా పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సూచించారు. ఒత్తిళ్లకు లొంగకుండా, ఎవరికీ భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని అన్నారు. దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని వివరించారు. మీడియా ఎప్పటికీ సత్యానికే అండగా ఉండాలని చెప్పారు. సత్య మార్గం నుంచి పక్కకు మళ్లొద్దని కోరారు.
‘మనసు ఎక్కడ నిర్భయంగా ఉంటుందో’ అని రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పద్యాన్ని రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. పీటీఐ 77వ వార్షికోత్సవం సందర్భంగా వార్తాసంస్థల ఎడిటర్లు బుధవారం రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన దేశంలో మహిళలను దేవతలుగా పూజిస్తుంటామని, మరోవైపు మన రోజువారీ ప్రవర్తనలో ఆ భావన కనిపించకపోవడం తనను అప్పుడప్పుడు ఆవేదనకు గురి చేస్తోందని ముర్ము వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment