
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘సీఎం చంద్రబాబు , రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు రాజయోగం దక్కడం కోసం కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేశాం అని సృజన్ కొన్ని రోజులుగా మాతో చెబుతున్నాడు. మేము పట్టించుకోలేదు. కానీ, ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు చేశారని వెలుగులోకి రావడంతో అది నిజమేనని అర్థమైంది’’... ఇదీ సృజన్ సన్నిహితులు, బంధువులు ప్రస్తుతం చెబుతున్న మాట.
దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పూజలు చేశారని చెప్పిన సృజన్ ఆచూకీ కనిపించడం లేదు. నారా లోకేశ్ కోసమే తాంత్రిక పూజలు చేశామని సృజన్ చెప్పడం... ఆ తరువాత అతడు కనిపించకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సృజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల వ్యూహం ప్రకారమే వారు నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎవరీ సృజన్?
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివేరుకు చెందిన అర్చకుడు సృజన్. అక్కడ శివాలయంలో పనిచేస్తున్నాడు. ఇంద్రకీలాద్రిపై డిసెంబరు 26న అర్ధరాత్రి తాంత్రిక పూజలు చేసిన సమయంలో అతడు అక్కడే ఉన్నాడు. స్మార్త వైదిక ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అమ్మవారి కవచాన్ని తొలగించి, మహిషాసురమర్థినిగా అలం కరణ చేసింది సృజనే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి అతని అచూకి లేదు. విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు నోరువిప్పడం లేదు. విజయవాడలోని ఓ గుర్తు తెలియని ప్రదేశంలో సృజన్‌ను ఉంచినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment