సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీఎం చంద్రబాబు... కవిటి మండల కేంద్రంతో పాటు కవిటి మండలంలోని జగతి గ్రామంలోనూ మహిళలు ఖాళీ బిందెలతో ఆయన కాన్వాయ్‌కు ఎదురుగా వెళ్లి నిరసన తెలిపారు. తమకు తాగునీరు అత్యవసరంగా సరఫరా చేయాలని మొరపెట్టుకున్నారు. గుక్కెడు నీరు పోసేవారే కనిపించట్లేదని, ఎవ్వరూ పట్టించుకోవట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కంచిలి మండలం తలతంపర గ్రామంలోనూ తమకు తాగునీరు అందలేదని మొరపెట్టుకున్నారు.
మంత్రి నారా లోకేష్... రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయనకు కూడా ఉద్దానంలో నిరసనలు తప్పలేదు. మందస సమీపంలోని రత్తి జంక్షన్ వద్ద వరద బాధితులు అడ్డుకున్నారు. నాలుగు రోజులుగా తమ ఆకలికేకలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. టీడీపీ నేత పీరుకట్ల విఠల్... పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ కారులో ప్రయాణిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌కు ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. కారులో ఉన్నది శివాజీ అనుకున్న మందస మండలం హరిపురం గ్రామస్థులు అడ్డుకున్నారు. కారును చుట్టుముట్టి నిరసనలు తెలిపారు. తమకు తాగునీరు సహా కనీస సౌకర్యాలు కల్పించడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టరు శైలజ... వరద ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన ఆమెను ఎల్‌ఎన్ పేట మండలంలోని మిరియాపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. తిత్లీ తుపానుతో వంశధార నది వరద తమ గ్రామాన్ని దిగ్బంధించి మూడ్రోజులైనా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఒక్క అధికారి కూడా అడుగుపెట్టలేదని, ఇప్పుడెందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆమె కారుకు అడ్డంగా బైఠాయించారు.
ఈ ఉదాహరణలు మాత్రమే. ఇవి తిత్లీ తుపాను బాధిత ప్రాంతాలు, వంశధార వరద ముంపు గ్రామాల్లో ప్రజల ఆక్ర కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజల ఆవేదనకు అద్దం పడుతున్నాయి. తమకు తాగునీరు, కరెంటు సహా కనీస సౌకర్యాలు కల్పించాలంటూ గగ్గోలు పెడుతున్నారు. నిత్యావసర సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నామని, తమ ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టట్లేదని ఆక్రోషిశిస్తున్నారు. సమస్యలు తీరే వరకూ ఇక్కడే ఉంటానని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించినా ఆయన హామీలేవీ ఆచరణలో కనిపించట్లేదు. ఇప్పటికీ 90 శాతం గ్రామాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ జరగలేదు. తాగునీటి సరఫరాలో ప్రత్యామ్నాయ చర్యలే కనిపించట్లేదు. సీఎం సహా రాష్ట్ర అధికార యంత్రాంగమంతా ఉద్ధానంలోనే మకాం వేసినా ఫలితం మాత్రం కనిపించట్లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. టీడీపీ నాయకులు ఎక్కడ కనబడితే అక్కడ అడ్డగించి తమ నిరసనలు తెలుపుతున్నారు.
తాగునీటికి కటకట...
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రజల ప్రధాన సమస్యలు తాగునీరు, కరెంట్ మాత్రమే. ఈ రెండూ మెరుగుపడితే మిగతా సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని ప్రజలే భావిస్తున్నారు. తుపాను బాధితులకు పునరావాసం, పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాత్రే శ్రీకాకుళం చేరుకున్నారు. తర్వాత రెండ్రోజులుగా పలాసలో మకాం వేశారు. ఉద్దానంలో కొన్ని మార్గాల్లో భారీ కాన్వాయ్‌తో పర్యటించారు. ఏరియల్ సర్వే కూడా నిర్వహంచారు. కానీ సమస్యలు ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయని ప్రజలు పెదవి విరుస్తున్నారు. శనివారం నాటికి కనీసం విద్యుత్తు పునరుద్ధరణ జరిగిన గ్రామాలు 30 శాతం మించలేదు. విద్యుత్తు అంతరాయంతో తాగునీటి ప్రాజెక్టులు కూడా పనిచేయట్లేదు. బావులు, చెరువులు వరద కారణంగా కలుషితమైపోయాయి. దీంతో తాగునీటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యలు అంతంతమాత్రమే.
అధికార యంత్రాంగం మోహరించినా...
సీఎం చంద్రబాబు సహా మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ట్రైనీ ఐఏఎస్‌లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సహా రాష్ట్ర యంత్రాంగం అంతా ఉద్దానంలో కొలువుదీరింది. 38 మంది ఐఏఎస్ అధికారులకు ఒక్కో మండలం చొప్పున అప్పగించారు. ఆ మండలంలో అన్ని వసతుల పునరుద్ధరణ బాధ్యత వారిదే. కానీ వారికి ప్రోటోకాల్ బాధ్యతలు చూసేందుకు రెవెన్యూ యంత్రాంగం అవస్థ పడుతోంది. క్షేత్రస్థాయిలో వారు అందించాల్సిన సేవలను పక్కనబెట్టి ఉన్నతాధికారులు, టీడీపీ నాయకుల ప్రోటోకాల్ సేవలకే పరిమితమవుతున్నారు.
ఇక చంద్రబాబుతో పాటు జిల్లా కలెక్టరు సహా అన్ని శాఖల అధికారులు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వారు తాము చేయాల్సిన పనులపై దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ఉద్ధానంలో గ్రామాలు వాహనాల శ్రేణులతో కిక్కిరిసిపోతున్నాయి. ఒక్క అధికారుల కోసమే సుమారు 220 కార్లను ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాలో అధికారులకు ఉన్న కార్లకు ఇవి అదనం. సీఎం కాన్వాయ్‌లో అయితే ఏకంగా 28 వరకూ కార్లు ఉంటున్నాయి. ఇక తాను పర్యటనకు వచ్చినప్పుడు కవిటి ఎంపీడీవో అందుబాటులో లేడనే కారణంతో సీఎం చంద్రబాబు ఆయన్ను సస్పెండ్ చేసినట్లు అక్కడికక్కడే ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment